✳ఒక కారు సమవేగంతో వెళ్తూ ‘అ’ అనే ఊరును ఉదయం 10.10 సమయంలో ‘ఆ’ అనే ఊరును ఉదయం 10.30 సమయంలో దాటిందనుకుందాం. ‘అ, ఆ’ ఊర్ల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉంటుందనుకుందాం. అప్పుడు ఆ కారు ఎంత వేగంతో వెళుతుందో తెలుసుకోవడం సులువే. అంటే 20 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 20 నిమిషాలు పట్టిందంటే... గంటకు ఆ కారు 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు అర్థం కదా.
ఇదే సూత్రం ఆధారంగా బౌలర్ చేతి నుంచి వెళ్లిన బంతిని రెండు లేదా మూడు దశల్లో సూక్ష్మ తరంగాల కెమెరాలతో ఏఏ సమయాల్లో దాటిందో కంప్యూటర్ సాయంతో కనుగొంటారు. ఆయా దశల మధ్య ఉన్న దూరాన్ని ఆ సమయాల మధ్య ఉన్న కాల వ్యవధిని దూరం/కాలం ఆధారంగా బంతి వేగాన్ని కొలుస్తారు.
సాధారణంగా ఈ కెమెరాల్ని క్రికెట్ పిచ్‌కి అటూ ఇటూ బౌండరీల దగ్గరున్న సైట్ స్క్రీన్లపై ఉంచుతారు. వాటి సాయంతో ఒక ‘సూక్ష్మ తరంగాల జనని’ ద్వారా సూక్ష్మ తరంగాల్ని పంపగా ఆ కెమెరాలు ఆ సూక్ష్మ తరంగాలు చేసే బంతి నీడను రెండు సార్లు కొలుస్తాయి. బంతి వెళ్లిన దూరాన్ని ఈ రెండు దఫాల ఫొటోల మధ్య కాలంతో భాగించి బంతి వేగాన్ని గుణిస్తారు. ఇందుకోసం అత్యాధునికమైన ఫాస్ట్ షెట్టర్ కెమెరాల్ని, పల్స్ పద్ధతులు వాడతారు.