- ఓసారి అగ్గిపుల్లను వెలిగించి చూడండి. పుల్ల క్రిందివైపున ఉంటుంది; మంట పైకి పోతుంది.
- క్యాండిల్ వెలిగించి చూడండి. క్రొవ్వొత్తి క్రింద ఉంటే, మంట పైకి తిరిగి ఉంటుంది.
- మరి క్యాండిల్ని తిరగ ద్రిప్పి వెలిగిస్తే? చేసి చూడండి- కానీ జాగ్రత్త- మంట పైవైపుకే వస్తుంది- క్యాండిల్ని, మీ వ్రేళ్లను కాల్చేట్లు! ఎందుకిలా జరుగుతుంది?
- మంట ఎప్పుడూ పైకే ఎందుకు పోతుంది?
✳మంటకు నూనెనో, మైనమో- ఏదో ఒక ఇంధనం కావాలి, తెలుసుగా? ఆ ఇంధనంనుండి రకరకాల వాయువులు వెలువడి మండటం వల్లనే, ఆ మంటకు నారింజరంగో, ఎరుపో, నీలం రంగో ఏర్పడుతుంటుంది. అయితే మండే వాయువులు తమ చుట్టూతా దూరంగా ఉన్న చల్లని గాలికంటే తేలికవుతాయి. వేడెక్కిన కొద్దీ వ్యాకోచిస్తాయి కదా, అందువల్ల వాటి సాంద్రత తక్కువౌతుందన్నమాట. అలా అవి గాలిలో పైకి తేలేందుకు ప్రయత్నిస్తాయి- అందువల్లనే మంట ఎప్పుడూ పైవైపుకే పోతుంది!