రామాపురంలో నాగయ్య,వెంకటయ్య అనేఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.కొన్నేళ్ళకు తండ్రి శివయ్య ముసలవాడాయి ,కొడుకులను దగ్గరకు పిలిచి ,నేను ఇంక ఎన్నో రోజులు బ్రతకను. నాతరవాత మీ ఇద్దరు ప్రేమగా ఉండండి.నా ఆస్తి ఒక ఆవు,ఒక కొబ్బరిచెట్టు,ఒక కంబళి అని మీకు తెలుసుకదా. వాటిని సమానంగా అనుభవించండని చెప్పి, కొన్ని రోజులకు చనిపోయాడు. చిన్నవాడు వెంకటయ్య అమాయకుడు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అన్న, “తమ్ముడూ.. ఆవు మొదటి సగభాగం నువ్వు తీసుకో, వెనక సగభాగం నేను తీసుకుంటాను, కొబ్బరిచెట్టు క్రిందనుండి సగభాగం నువ్వుతీసుకో, ఆపైభాగం నేనుతీసుకుంటాను; అలాగే కంబళి పగలు నువ్వు వాడుకో, రాత్రులు నేనువాడుకుంటాను అన్నాడు,” తమ్ముడు సరేనన్నాడు. ఆవుకు గడ్డివేసి తిండిపెట్టడం తమ్ముడుపని. పాలు పితుక్కోవడం అన్న అవకాశం. అలాగే కొబ్బరిచెట్టుకు ఎరువు,నీరు వేయడం తమ్ముడుపని. చెట్టు ఫలాలు అందిపుచ్చుకోవడం అన్న నాగయ్య పని. పగలు కంబళి అవసరం లేక రాత్రులు చలికి వణికిపోవటం తమ్ముడు వంతు. కొన్నాళ్ళకు వెంకటయ్య నీరసించి,తన బాధను చెప్పుకోవడానికి ఆ ఊరి పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన అంతా విని తను చెప్పినట్టు ,అన్న చూస్తూఉండగా చేయమని,పంపించివేసాడు. ఇంటికి వచ్చి వెంకటయ్య అన్న పాలు పితుకుతుండగా ఆవు ముఖ భాగాన్నికొట్టాడు. ఆవు బెదిరి పాలు ఇవ్వడం మానేసింది. అన్న చూస్తూఉండగా కొబ్బరిచెట్టు మొదటిభాగాన్ని నరకటం మొదలుపెట్టాడు.
కంబళిని పగలంతా నీళ్ళల్లో ముంచి అట్టేపెట్టాడు. వెంటనే అన్న తమ్ముడుకి ఎవరో తెలివి నేర్పారు అని గ్రహించి,తమ్ముడితో నిన్ను మోసం చేశాను. ఇంకెప్పుడూ చేయను ,మంచిగా ఉంటాను, అని ప్రాధేయపడ్డాడు. తమ్ముడు సరేనని,ఇద్దరూ అప్పటినుండి ప్రేమగా,హాయిగా బ్రతకటం నేర్చుకున్నారు. అన్నని మాత్రం ఆ ఊరి వాళ్ళు చీదరించుకున్నారు.
నీతి– ఎవరిని అయినా మోసం చేస్తే ,అప్పటికప్పుడు కాకపోయినా,ఎప్పటికయినా అందరికి తెలుస్తుంది.