భావాలను వ్యక్తీకరించడం చాలా జంతువుల్లో ఉంది. ఇది ఏకకణజీవులు, మెదడు లేని జీవులకు సాధ్యం కాదు. ఎందుకంటే భావం అంటేనే పరిసర పరిజ్ఞానాన్ని పొందడం, దాన్ని జ్ఞాపకంగా పదిల పరుచుకోవడం, ఆ సమాచారం ఆధారంగా తోటి జీవితో తన ప్రవర్తనను నిర్ణయించుకోవడం అన్నమాట. మెదడున్న జీవులన్నీ వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. మనుషుల్లో కన్నీరు, ఏడుపు, దిగులు మొహాన్ని చాటే కండరాల ప్రవృత్తిలాంటి రూపాల్లో దుఃఖం ప్రదర్శితమైతే, నవ్వు, మెరిసే కళ్లు లాంటి ప్రవృత్తుల ద్వారా ఆనందం ప్రకటితమవుతూ ఉంటుంది. కొన్ని జంతువుల్లో భావాలను రసాయనిక పదార్థాలను స్రవించడం ద్వారా కూడా వ్యక్తపరుస్తాయి. హార్మోను వ్యవస్థ ఉన్న జంతువుల్లో భావ వ్యక్తీకరణ ప్రస్ఫుటంగా ఉంటుంది. అయితే మొక్కలకు మెదడు, వినాళగ్రంథి (endochrine system) ఉండకపోవడం వల్ల ఏడుపులు, నవ్వులు ఉన్నట్టు ఆధారాలేమీ లేవు. అయితే కొన్ని రసాయనాలను వెదజల్లడం ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది.