ఆదిత్యపురం పొలిమేరల్లో చంద్రయ్య, శేఖరయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. చాలాకాలంగా వాళ్లదగ్గర ‘కల్యాణి’ అనే గుర్రం ఉండేది. దూరాలకు తీసుకెళ్లడంలో, బరువులు మోయడంలో ఇద్దరికీ సహాయకారిగా ఉండేది. ఒకరోజు- అధిక బరువు మోసుకెళ్తూ.. కల్యాణి ప్రమాదవశాత్తూ పనికిరాని బావిలో పడింది. చంద్రయ్య, శేఖరయ్య – ఆ విషయాన్ని గమనించలేదు. తరువాత -కల్యాణి ఏమైపోయిందోనని వెతకడం ప్రారంభించారు. ఇరుగు పొరుగు పొలిమేర్లన్నీ వెతికారు. ఫలితం లేదు. చేసేదేమీలేక ఇంటికి చేరారు. ఇంటిదగ్గర పనికిరాని బావినుంచి -శబ్దాలు వినిపించడంతో చంద్రయ్య, శేఖరయ్య తొంగిచూశారు. అందులో కల్యాణి!! . దాన్ని పైకి తీయడానికి తోటి ఆసామీలతో కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. ‘మా గుర్రం ఎలాగూ ముసలిదైంది. దాన్ని పైకి తీయకపోతే అక్కడే చస్తుంది. తరువాత ఎలాగూ పాతిపెట్టాలి. బావి పాడైంది కనుక, గుర్రాన్ని ఉంచేసి బావిని నింపేస్తే -రెండు పనులు పూర్తవుతాయి. మరే గుర్రం ఇందులో పడదు’ అన్నారు. చంద్రయ్య, శేఖరయ్యల ప్రతిపాదన తోటి ఆసామీలకు నచ్చింది. అన్నదమ్ములు వాళ్లతో పార కలిపారు. మట్టి తోడారు. నూతిలో పడిన కల్యాణి మాత్రం –అన్నదమ్ముల నిర్దయకి బాధపడింది. వద్దువద్దని సకిలిస్తూనే -కన్నీళ్లు పెట్టుకుంది. అయినా చంద్రయ్య, శేఖరయ్య చలించలేదు. చివరకు తెలివి తెచ్చుకుని -మీదపడుతున్న మట్టిని దులపడం మొదలెట్టింది కల్యాణి. అన్నదమ్ములు మట్టి పోస్తున్నారు. కల్యాణి దులుపుతుంది. క్రమంగా బావి నిండింది. మీదపడిన మట్టినే ఒక్కో మెట్టూ చేసుకుని పైకి వచ్చిన కల్యాణి -ఒక్క గెంతులో చంద్రయ్య, శేఖరయ్యలకు దొరకకుండా తప్పించుకుని పొలిమేర్లకు దౌడుతీసింది – పంచకల్యాణిలా !!
సూక్తి : మనపైకి ఎవరైనా కుత్సత బుద్దితో రాళ్ళేస్తే ఆ రాళ్ళతోనే మనం భవనం కట్టుకోగలగాలి.