కళ్లకు ధరించే కొన్ని కళ్లజోళ్ల కటకాలు (lenses ) నీడలో తెల్లగా ఉండి, వెలుగులోకి రాగానే నల్లగా మారతాయి. మరలా నీడలోకి వచ్చిన కొంతసేపటికే యథాప్రకారం తెల్లగా మారతాయి. ఈ కటకాలను ఫొటోక్రోమిక్ లెన్సులు (photo chromic lenses) అంటారు. ఇవి మొదటిసారిగా 1960లో మార్కెట్లోకి వచ్చాయి. ఈ కటకాలను తయారుచేసే గాజులో సిల్వర్ హాలైడ్ల అణువులు ఉంటాయి. ఈ అణువులకు సూర్యకిరణాల్లోని అతి నీలలోహిత కాంతి సోకగానే ఒక రకమైన మార్పునకు లోనవుతాయి. సిల్వర్ హాలైడ్లలో ఉండే సిల్వర్ హాలోజన్ కణాలు విడివడి సిల్వర్ కణాలు తెల్లగా ఉండే కటకాలను నల్లగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో కంటికి కనబడే కాంతి వర్ణపటంలోని కొంత కాంతి శోషింపబడుతుంది. మరలా నీడలోకి రాగానే కటకాలపై అతి నీలలోహిత కిరణాలు పడకపోవడంతో అంతకుముందు సూర్యరశ్మిలో విడివడిన సిల్వర్, హాలోజన్ అణువులు మళ్లీ కలిసిపోతాయి. దీంతో కటకాలు మునుపటి తెల్లని కాంతిని తిరిగి పొందుతాయి.