✳కేవలం గాలి లేకపోవడాన్నే శూన్యమనుకుంటే చంద్రుడు కూడా శూన్యంలోనే ఉన్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సాధారణంగా శూన్యం (అంతరిక్షం, space) అంటే ఏ క్షేత్ర ప్రభావం(field effect)లేని ప్రాంతం. అక్కడ గురుత్వాక్షర్షణ(gravity)ఉండదు. అలాంటి చోట బంతిని కాదుకదా, ఏ వస్తువును ఉంచినా అది ఉంచిన చోటే ఉంటుంది. ఒకవేళ కొంత బలంతో విసిరేస్తే అది చేతి నుంచి వదిలినపుడు ఎంత వేగంతో బయట పడిందో అంతే వేగం(uniform valocity)తో అలా పోతూనే ఉంటుంది. (తిరిగి ఎక్కడయినా ఇతర క్షేత్రాల ప్రభావంతో పడేంత వరకు). అయితే భూమ్యాకర్షణ పరిధిలో ఉన్న ఉపగ్రహాలు(satelites),అంతరిక్ష ప్రయోగ శాలలు (space stations)వంటి చోట్ల బంతిని విసిరేస్తే తప్పకుండా అది తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి చుట్టూ తిరుగుతుంది. కానీ బంతికి సరిపడా వేగాన్ని ఇవ్వాలి. ఇది భూమ్యాకర్షణ ఉన్న క్షేత్రంలో ఎంత ఎత్తున ఆ వస్తువు (బంతి) ఉందన్న దూరం మీద ఆధారపడి ఉంటుంది.