మన నాలుగు వేదాల సారమంతా ఉపనిషత్తుల్లో ఉంది.
ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతలో ఉంది.
భగవద్గీత సారమంతా పంచమహావాక్యాలో ఉంది.
ఏమిటా ఐదు మహావాక్యాలు?
అందులో ఉన్న సారమేమిటో తెలుసుకుందాం.
మన నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలను ప్రసాదించాయి.
రుగ్వేదంలోని ఐతరీయోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అంటోంది.
ఈ అఖండమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని ఈ మహావాక్యం అంటోంది.
యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మస్మి అని తెలియజేసింది.
అహం అంటే నేను, బ్రహ్మస్మి అంటే బ్రహ్మను అయి ఉన్నాను అని అర్థం. దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం తెలుపుతోంది.
ఇక మూడో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు. నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం. సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన మహావాక్యమిది.
ఇక నాలుగో మహావాక్యం అయమాత్మా బ్రహ్మ.
అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం. అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ మహావాక్యం వచ్చింది.
ఈ నాలుగు మహావాక్యాల సారమే పురుషసూక్తం.
ఆత్మే పురుషుడు అని ఈ నాలుగు మహావాక్యాలు తెలియజేశాయి.
ఈ నాలుగు మహావాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో పొందుపరిచారు.
ఆ మహావాక్యమే సర్వం ఖల్విదం బ్రహ్మ.
అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు.
దేవుడి కోసం వెతికేవారికి, దేవుడెవరో తెలుసుకోగోరే వారికి ఈ మహావాక్యాల సారం అర్థమయితే చాలు.
భగవంతుడు మరెక్కడో లేడు... మన అందరిలోనూ అన్ని జీవుల్లోనూ ఉన్నాడని అర్థమవుతుంది.
మన మెవరో ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోడానికి ఇచ్చిందే ఈ శరీరం.
మన లోపల మనం వెతుక్కుంటే సమాధానం అదే వస్తుంది.
అంతే తప్ప బయట ఎక్కడో వెతికితే సమాధానం దొరకదు.
భగవంతుడి కోసం వెతికేవారికి చక్కటి మార్గదర్శిలా ఈ మహావాక్యాలు ఉపయోగపడతాయనడంలో అతిశయోక్తి లేదు.