_అస్సలు సాధ్యం కాదు. ఆలోచనలను పరిశుద్ధం చేసుకోవాలి కానీ అవి రాకుండా చేస్తానంటే కుదిరేది కాదు.
ఎందుకంటే మన జీవనం అంతా ఆలోచనలతోనే ముడిపడివుంది.
మనకి మల్లెపూల వాసన వచ్చిందంటే అప్పటికే అక్కడి గాలి మల్లెపులతో మమేకత చెందిందని అర్ధం.
అంటే గాలే మల్లెపూల వాసనగా మారింది. ఆ గాలిని, వాసనను ఎలా విడదీస్తాం ?
కాకపోతే ఆ మల్లెల వాసన గాలి సహజగుణం కాదని తెలుసుకోగలుగుతాం.
అలాగే శరీరంతో మమేకత చెంది దేహ అవసరాలన్నీ తానుగా వ్యక్తంచేసే మనసుని దేహం నుండి వేరుచేయలేం.
మనసు దేహంగా మారింది.
కాబట్టే ఆకలి వేస్తుందన్న విషయం గుర్తించగలుగుతుంది.
జ్ఞాని అయినా ఆకలిని మనసుతో గ్రహించాల్సిందే. కాకపోతే ఆ అవసరం మనసుది (తనది) కాదని, దేహానికి చెందిందని తెలుసుకొని జీవిస్తాడు.
భగవంతుని సృష్టిలోనే దేహంతోపాటు ఆలోచన కూడా ఒక భాగంగా ఉంది. దాన్ని వదిలించుకుందామని అనుకుంటే ఇక జీవనం ఉండదు.
ప్రజ్ఞగా ఉన్న మనసు ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? మనం జన్మించినదే కర్మ పూర్తిచేసుకోవటం కోసం.
అది ఆలోచన లేకుండా సాధ్యం కాదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}