ఒక రాజు గారికి ఒకటే కన్ను మరియు ఒకటే కాలు ఉండేవి.
రాజ్యంలో ఉన్న చిత్రకారులందరినీ పిలిచి తన చిత్రం అందంగా వెయ్యమని అడిగారు. రాజుగారిలో ఉన్న లోపం వల్ల ఎవ్వరూ చిత్రం గీయలేకపోయారు.
రాజు గారు తన చిత్రం అందంగా గీసిన వారికి విలువైన బహుమతి ఇస్తానని ప్రకటించాడు.
ఒక చిత్రకారుడు ముందుకు వచ్చి నేను గీస్తానని రాజు గారికి చెప్పాడు.
చిత్రకారుడు చాలా అందమైన చిత్రం గీశాడు. అంత అందమైన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాజుగారు వేటకి వెళ్ళి గుర్రం మీద కూర్చుని, ఒక కన్ను మూసుకుని మరొక కన్ను లక్ష్యంమీద గురి పెడుతున్నట్లు అందమైన చిత్రం గీసాడు.
రాజుగారి శరీరంలో ఉన్న లోపాలు కనిపించకుండా, రాజుగారి మనసు నొప్పించకుండా చిత్రం గీశాడు.
నీతి
మనం కూడా మనలో ఉన్న బలహీనతలు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి. అలాగే ఎదుటివారిలోని బలహీనతలు చూపించి వారిని నొప్పించకుండా వారి బలాలను వారికి గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని పంచగలగాలి.
------------
కుపితోపి గుణాయేవ గుణవాన్ భవతి ధృవమ్
స్వభావ మధురం క్షీరం క్వథితం హి రసోత్తరమ్
ఎలా అయితే సహజ సిధ్ధంగా మధురమైన రుచిగల పాలని వేడి చేస్తే ఇంకా పౌష్ఠికమైన పెరుగు, వెన్న , నెయ్యి వస్తాయో… అలాగే గుణవంతుడిని ఎన్ని రకాలుగా కుపిత అంటే ప్రేరేపించినా గుణవంతుడిగానే వుంటాడు సమాజ శ్రేయస్సు కోసమే జీవిస్తాడు. పైగా అతని సద్గణాలు మరింత కొత్త మెరుగులు దిద్దుకుని ఆదర్శమైన వ్యక్తి గా తయారవుతాడు. అందువల్ల ఏవరైనా మనలను ప్రేరేపించినా, అవహేళన చేసినా దానివలన మనకు కలిగిన క్షణికమైన క్రోధాన్ని మన ఉన్నతికి తోడ్పడేలా చూసుకోవాలి కానీ ప్రతీకారం కోసం ఆలోచించకూడదు.