మౌనం మహోన్నతమైన సాధన. అది ప్రాపంచికమే కావచ్చు. పారమార్థికమే కావచ్చు. ఎందుకంటే దాని ఫలితాలు, ప్రయోజనాలు అత్యధికం. పారమార్థికమే అయితే అనంతం కూడా. ప్రాపంచిక మౌనానికి ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. కొందరికి అంతగా అవగాహనలోకి రాని కొన్ని విషయాలు ఏమిటంటే- మాట్లాడకపోవటం మాత్రమే మౌనం కాదు. మాటలు వాడకపోవడం ఒక్కటే మౌనం కాదు. మౌనదీక్షలో ఉన్నామంటూ సంజ్ఞలు చేయడం, వాటిని అవతలివారు అర్థం చేసుకోలేనప్పుడు ఆగ్రహించడం- హాస్యాస్పదం. ఎంతో హుందా అయిన అత్యంత గంభీరమైన మౌన ప్రక్రియను అలా చవకబారు ప్రహసనం చేయటం ఎవరికైనా గౌరవప్రదం కాదు. మౌనంలో ఒక ప్రసన్నత ఉండాలి. ఆ మౌని సమక్షంలో ఇతరులు ఆశ్వాసన పొందగలిగే మధుర గాంభీర్యం ఉండాలి. మాటల అవసరాన్ని తోసిరాజని మౌన మాధుర్యంతో భావాన్ని అందించగలగాలి.
మౌనసాధన సాగేకొద్దీ మౌనంలోని మాధుర్యపు రుచి అర్థమవుతూ వస్తుంది. మనో జిహ్వకున్న రుచి మొగ్గలు ఆ రుచిని ఆస్వాదించటం ప్రారంభిస్తాయి. అప్పుడు మాటలు అరుచిగా తోస్తాయి. అనవసరమైనవిగా భాసిస్తాయి. ఇక ఆధ్యాత్మిక సాధకుడైతే గురువు వచ్చేదాకా ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ ఈ రుచిని ఎందుకు ఎవరూ పరిచయం చేయలేదని ఆశ్చర్యపోతాడు. ఇన్నాళ్లూ ఆ రుచికి దూరమైనందుకు తనమీద తానే జాలిపడతాడు. మాటే మంత్రం కావచ్చు. మాటల మాంత్రికులూ ఉండవచ్చు. ఆ వ్యవస్థ వేరు. కానీ మౌనం స్థాయి వేరు. దాని ప్రయోజనాలు వేరు.
మౌనం మహోన్నతమే అయినా ప్రాపంచిక మౌనానికి, పారమార్థిక మౌనానికి హస్తిమశకాంతర భేదం ఉంది. జన్మోద్దేశ సాధనకై జీవితాన్ని అంకితం చేసినవారు తమ సాధనకు ఆలంబనగా మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే మానవ జన్మ ఉద్దేశం మాటల మార్పిడి కాదు. శబ్దాల పేర్పిడి కాదు. అది మౌనామృత పానం. మౌనరాగ ఆలాపనం. అంత గొప్ప ‘పర’సాధనలో మనకు అద్వితీయమైన సహకారాన్నందించే మౌనాన్ని మనం వినమ్రులమై స్వీకరించవలసిన అవసరం ఉంది.
మనం ప్రపంచంలో ఉంటున్నా- మౌనం ప్రపంచంతో సంబంధాన్ని మూడు వంతులు తగ్గిస్తుంది. ఉన్మత్తుల్ని గావించే ఇంద్రియాల ఉద్వేగాలను ఉపశమింపజేస్తుంది. పారమార్థిక ఉన్నతికి ప్రధాన సాధనమైన, ఉత్తమ ఉపాధి అయిన మనసును మౌనం సాత్వికం చేస్తుంది. సంయమన సమర్థం చేస్తుంది. పారమార్థిక సాధనా ప్రయాణంలో మౌనం- పాదాలకు ఇచ్ఛాగమన సమర్థమైన పసరు పూసుకోవడం లాంటిది.
నిజానికి సాధన ఏదైనా మౌనాన్నే ఆశ్రయిస్తుంది. మౌనం ఒక యోగం. మౌనం ఒక యాగం. మౌనం ఒక ఆపాతమధుర రాగం. చివరకు భగవంతుడి శబ్దరూపమైన ఏకాక్షర ప్రణవ శబ్దపు అంత్యభాగం కూడా మౌనంలోనే (నిశ్శబ్దంలోనే) లయించిపోతుంది. నిజానికది అంతం కాదు. మరో ప్రణవ ప్రారంభానికి ఆహ్వానం..