రామాపురం లోని రామాలయం గుడి పూజారి గొప్ప దైవభక్తుడు.వారు నిరంతరం రామ నామస్మరణ లొనే వుండేవారు..
తన కష్టసుఖాలు ఆ శ్రీ రామ చంద్రుడే చూసుకుంటాడని నమ్మేవారు..
ఒక సారి ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి.
ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది..
ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు-
ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు.
ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.
కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి.
పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.
ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు..
కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.
ఇంకాసేపటికి వరద ఉధృతి బాగా ఎక్కువైంది.
పూజారి గారు గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు.ఈ వాన తగ్గేట్లు లేదు. ..స్వామి నీకు నేనేమి లోటు
చేసాను..నిరంతరం నీ ధ్యానమే కదా...నాపై నీకు ఇసుమంతయినను కరుణ లేదా..అని వేడుకొన్నాడు.
అప్పుడు రాముల వారు అన్నారు...మూర్ఖుడా...నీ
కోసం మనిషిని పంపాను..
బండిని పంపాను..పడవను పంపాను....నీవే వద్దన్నావు కదా......
మన పూజారి గారికి తెలిసొచ్చింది...ఇంతలో అటు గా వెళ్తున్న వేరొక బృందం పూజారి గారిని రమ్మని పిలిచారు...అంతే ఇంక వారు పరుగెత్తుకుంటూ వెళ్లి అందరితో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు..
**********
భగవంతుడు మనకు అవకాశాలను మాత్రమే ఇస్తాడు.
వాటిని సద్వినియోగం చేసికోవడం మన చేతుల్లోనే ఉంటుంది...
***********
నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః ।
విక్రమార్జితరాజ్యస్య స్వయమేవ మృగేంద్రతా ॥
అరణ్యంలోని జంతువులన్నీ వాటీంతట అవే కలిసి వచ్చి, “నీవే మా అరణ్యానికి అంతటికీ రాజువు, నీవు మమ్మల్ని పరిపాలించు!” అని పవిత్రమైన గంగా జలాలని శిరస్సు మీద జల్లి, సింహానికి సంస్కార ప్రోక్షణలు, అభిషేకాలు చేసి రాజ్యాభిషిక్తుని చేయవు.
తన స్వంత పరాక్రమముతో సాధించిన రాజ్యానికి మృగేంద్రత్వాన్ని స్వయముగా తానే సిధ్ధింపజేసుకుంటుంది సింహం.
అనగా, స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, స్వయంశక్తితోను, నాయకత్వముతోను కార్యసాధనని సాఫల్యం చేసుకుంటారు, మరొకరి మీద ఆధారపడకుండా, వేరొకరి ప్రమేయం లేకుండా, ప్రతిభా పాటవాలతో, స్వయం శక్తితో కృషిచేసినచో మాత్రమే లక్ష్య సాధనని చేరుకుంటారు. అట్టి వారి ప్రయత్నమే వారికి సత్ఫలితాలని ఇస్తుంది. ప్రయత్నసాధనయే ప్రగతికి మార్గం అని స్పష్టమౌతున్నది.