ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి ఉండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెక్కల్ని రెపరెపలాడిస్తూ, ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా..! రండి! మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో గెంతుకుంటూ వచ్చిన పిల్లలకు,
👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..!
👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!
👉 వలవేస్తాడు జాగ్రత్త..!
👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!
👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. !
అనే పాటనేర్పింది.
అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్య..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి వెళ్ళిపోయింది ఆ తల్లిపక్షి.
ఈలోగా రానే వచ్చాడు వేటగాడు.
వాడిని చూడగానే పక్షి పిల్లలు
వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి.
అది విన్న వేటగాడు ఆశ్చర్యపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం..అని గింజలు విసిరాడు.
వెంటనే ఆ పక్షిపిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి.
మరింత ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు.
ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ పక్షి పిల్లలు అతడు విసిరిన వలపై వ్రాలాయి.
పాడుకుంటూ గింజలు తింటున్న పక్షుల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ పక్షులు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.
అయ్యో... ఈ పక్షులు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు.
నేడు మనమందరమూ చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు, వింటున్నాము, చదువుచున్నాము. పాటించకుండా వదిలేస్తున్నాము.