ఈ మధ్య మా దూరపు బంధువు ఒకాయన తన కూతురు పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చాడు. కర్నాటకలో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ ఖరీదైన కారులో ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన కళ్లజోడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకసారి చూసి పక్కున పడేసే పెళ్లి పత్రికతో సహా అన్నీ ఖరీదైనవే ఉపయోగించే ఆయన పెళ్లికి పిలిచిన తరువాత నాతో నీవు చిన్నతనం నుండి చాలా తెలివైన వాడివి కదా మరి ఇప్పుడు కేవలం యోగా శిక్షణతో మాత్రమే ఆగిపోయి, కేవలం అమ్మకు సేవ చేసుకుంటున్నానని అమ్మను చూసుకొంటూ కూర్చుంటే రేపు నీ పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేస్తావు? అన్నాడు..
*అలాగే నన్ను చూడు నా తెలివితో కోట్లు సంపాదించి మా అమ్మ పేరుతో కోటి రూపాయలు డిపాజిట్ చేశాను. అలాగే ఆమెను చూసుకోవడానికి పని మనుషులను నియమించాను. ఇక అంతా వాళ్ళే చూసుకొంటారు అన్నాడు. అది విన్న నాకు అతడి మాటలు కొత్తగా ఆశ్చర్యపోయే విషయంగా కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేస్తున్న తప్పు ఇదే కదా. అలాగే అతడితో నా శిష్యుడికి జరిగిన ఒక స్వానుభవాన్ని ఆయనకు వివరించాను..
*నిజానికి తల్లిదండ్రులు తమ బిడ్డలను కనిపెంచే సమయంలో వారు పడే కష్టానికి, ఆవేదనకు, సహనమునకు బదులు తీర్చుకోవడం ఆ బిడ్డలు ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా అది పూర్తి కాదు. ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోలేరు. దీనికి ఉదాహరణ..
*సుబ్బారావు అనే నా శిష్యుడు తన తెలివితేటలతో గొప్పగా వ్యాపారం చేసి కోట్లు గడించి తన తల్లి ఋణం తీర్చుకోవాలనే భావంతో ఒక లక్ష రూపాయల సంచిని తీసుకొచ్చి తల్లి పాద పద్మములకు సమర్పిస్తూ "అమ్మా! ఈ డబ్బు నీకు ఇష్టమైన విధంగా దానం చేసుకో, దానితో నీ ఋణం నుండి నాకు ముక్తి లభిస్తుంది.” అని అన్నాడు. అది విన్న ఆ ఆ తల్లి అన్నది....
_*చూడు నాయనా ! నా రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే నాకు నువ్వు సంపాదించిన డబ్బును ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఒక్క రోజు రాత్రి పూట నావద్ద పడుకో ” చాలు అన్నది. అందుకు సమ్మతించిన సుబ్బారావు ఆ రాత్రి తల్లి దగ్గరకు పోయి ఆమె పక్కనే తోడు పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టగానే ఆ తల్లి అతడిని లేపి “నాయనా దప్పికయినది నీళ్లు ఇవ్వు” అన్నది..
అమ్మ తనను మొదటి సారిగా అడిగిన ఆ పనికి సుబ్బారావు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్లిచ్చాడు. రెండు గుటకలు వేసి మిగిలిన నీటిని పక్క మీద దొర్లించింది. పక్క అంతా తడిసి పోవడం చూసి “ఏంటి ఇలా చేసావ్ అమ్మా ” అని సుబ్బారావు అడుగగా “నాయనా పొరపాటు అయింది” అని చెప్పింది. అందుకు సుబ్బారావు శాంతించి నిద్రపోయాడు.
సుబ్బారావు గాడ నిద్రలో గురకలు పెట్టడం మొదలు పెట్టగానే తల్లి మళ్ళీ లేపి “నాయనా! దప్పిక అవుతున్నది నీళ్లు ఇవ్వమన్నది. అందుకు సుబ్బారావు విసుక్కుంటూ అమ్మా ఇప్పుడే కదా నీళ్ళు ఇచ్చాను. ఇంతలోనే మరల దప్పిక అయినదా ” అంటూ వస్తున్న కోపాన్ని అనుచుకొంటూ లేచి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆ తల్లి మొదటి సారిలాగానే ఒకటి రెండు గుక్కలు తాగి మిగిలిన నీటినంతటినీ పక్క మీద పోసింది.
*దీనికి సుబ్బారావు విసుక్కుంటూ “అమ్మా ఏమిటి నువ్వు చేస్తున్నది, చూడు పక్క ఎలా తడిపేశావు.” నేనెలా పడుకోవాలి అనగా “నాయనా! చీకటిగా ఉన్నందున గ్లాసు చేతి నుండి జారిపోయింది” అని జవాబు చెప్పింది. సరే అని శాంతించిన సుబ్బారావు వెంటనే నిద్రపోయాడు. కాసేపటికి సుబ్బారావు నిద్ర పోతుండగా మరలా లేపి మంచినీళ్లు అడగగానే ఈసారి సుబ్బారావుకు పిచ్చ కోపం వచ్చింది. ఆవేశంతో, కోపంతో “అమ్మా ఏమిటి ఒకటే దప్పిక దప్పిక అని నన్ను చంపేస్తున్నావు. నన్ను నిద్ర పోనిస్తావా? లేదా” అంటూ విసురుగా వెళ్ళి నీళ్ళు తీసుకువచ్చి “ఇదిగో తాగి చావు” అన్నాడు కోపంగా..
*ఆ తల్లి మరల మొదటి లాగానే కొంచెం నీరు తాగి తక్కిన నీటితో పక్కను తడిపేసింది. అది గమనించిన సుబ్బారావు ఇక సహించలేక పోయి కోపంతో... “ఇలా తడిసిపోయిన పక్కమీద నేను ఎలా పడుకో గలను? నీకు మతి చెడిపోయినట్లు ఉందంటూ.” కోపంగా అన్నాడు.
*అది విని అప్పుడు ఆ తల్లి... చూడు నాయనా ! నీవు నా ఋణం తీర్చుకుంటానన్నావు. తల్లి ఋణం తీర్చుకోగలుగుతావా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీవు అన్ని జన్మలెత్తినా, నీ జీవితాంతం తల్లికి నిరంతర సేవ చేసినా కూడా మాతృఋణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటే నీవు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీవు పక్క మీద మలమూత్రములు వదిలేవాడవు. మురికయి వాసనతో తడిసిపోయిన నీ బట్టలను విప్పేసి, నా వద్ద ఉన్న పొడి గుడ్డలతో నిన్ను కప్పేదాన్ని.
*నీ తడిసిన గుడ్డలను నా క్రింద పెట్టుకొని నిన్ను పొడిగా ఉన్న నా చీరెతో కప్పి ఏడుస్తూన్న నిన్ను నిద్రబుచ్చే దాని కోసం గంటలతరబడి జోకొడుతూనే ఉండేదాన్ని. అలా ఒక్క రోజు రెండు రోజులు వారం రోజులు కాదు, నిరంతరం కొన్ని సంవత్సరాల వరకు చేశాను. అంటే...నీ అంతట నీవు వేరేగా పడుకోగలిగే వరకు నేను అలా చేస్తూనే ఉండేదాన్ని. నిద్ర ముంచుకొస్తున్నా కళ్ళళ్ళో వత్తులు వేసుకుని రేయింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొనేదాన్ని అదీ ఆనందంతో, సంతోషంతో..
*మరి నేను పొరపాటుతో ఒకటి రెండు సార్లు పక్క నీటితో తడిపేసినందుకే నీకు అంతలా కోపం వచ్చి విసుక్కుంటున్నావు. అదికూడా ఒక్క రాత్రికే కాదు కొన్ని గంటలకే ఇంత విసుగుతో, చికాకుతో, చిరాకుతో, ఆవేశంతో నన్ను కోప్పడ్డావే ” మరి అప్పుడు నేను కొప్పడి విసిగిపోయుంటే ఈ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు అన్నది..
ఇదంతా విన్న మా సుబ్బారావు సిగ్గుతో తలదించుకుని తల్లి పాదాలు పట్టుకుని అన్నాడు.“అమ్మా !నీవు ధన్యురాలవు. నీ ఋణం చెల్లించడం అసంభవం. ఇట్టి మమతా స్వరూపిణి యగు మాతృమూర్తితో ప్రతి పుత్రుడు పుత్రికలు జీవితాంతం కేవలం సేవకులుగా ఉండాలి తప్ప, తల్లికి చేసే సేవకోసం పనిమనిషులను పొరపాటున కూడా పెట్టకూడదు. అలాగే ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఆ తల్లి ఋణాన్ని తీర్చుకోలేమన్న నగ్నసత్యాన్ని బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ”.. అన్నాడు..
*ఇదంతా విన్న మా బంధువు కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని తుడిచుకొంటూ నా తల్లికి పాదాభివందనం చేసి "ఈ నీ కుమారుడి సేవలో తరించిపోతున్న మీ జన్మధన్యం తల్లి. ఇలాంటి కొడుకు నీకు దొరకడం అనేది నీవు గతజన్మలో చేసుకొన్న పుణ్యఫలం అని అంటూ, నా దగ్గరకు వచ్చి క్షమించమన్నట్లుగా నా రెండు చేతులు పట్టుకుని "నీ దగ్గర డబ్బు లేకపోయినా, నా కంటే గొప్ప కోటీశ్వరుడివి నువ్వే అంటూ " భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు..
*కాబట్టి మిత్రులారా ! మీరు కూడా ఆలోచించండి, తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే పద్ధతి ఏదో..
సర్వే జనా సుఖినోభవంతు.