అన్నమయ్య సంకీర్తన
🌸🌸🌸🌸🌸🌸🌸
రాగము: శ్రీరాగం
రేకు: 0356-01
సంపుటము: 4-327
॥పల్లవి॥
ఓ పవనాత్మజ వో ఘనుఁడ
బాపుబాపనఁగఁ బరగితిగా!!
॥చ1॥
వో హనుమంతుడ వుదయాచలని -
ర్వాహక నిజసర్వ ప్రబల -
దేహము మోఁచిన
తెగువకు నిటువలె
సాహసమిటువలెఁ జాటితిగా!!
॥చ2॥
వో రవిగ్రహణ వో దనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపువినతాతనయాదలు
గారవింప నిటు గలిగితిగా!!
॥చ3॥
వో దశముఖహర
వో వేంకటపతి -
పాదసరోరుహపాలకుఁడా
యీ దేహముతో నిన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా!!