ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య యిచ్చాడు.సముద్రానికి అనేక పర్యాయపదాలు వున్నాయి.
'అంభోధి,జలధి:,పయోధి:,ఉదధి:,వారాంనిధి:వారిధి:' అని ఆరు సమానార్థక పదాలు ఆఖరి పాదంగా యిచ్చి పూరించమన్నాడు.
కాళిదాసు ఒక చక్కటి కథ ఊహించాడు.చమత్కారంగా యిలా పూరించాడు...
అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయం ఉత్సృజ్యతాం !
విద్వన్ షణ్ముఖ!కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?
కోపావేశవశాత్- అశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి:పయోధి :రుధధి,వారంనిధి:వారిధి:
పార్వతికి కోపం వచ్చింది
ఎందుకు?తనభర్త తనకో సవితి ని తీసుకొని
రావడమే గాక ఆమెని నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటే కోపం రాదా?
కుమారుడైన షణ్ముఖుడికి తన కష్టం చెప్పుకుంది.
కుమారుడికీ కోపం వచ్చింది.నేరుగా పరమశివుడి దగ్గరకు వెళ్లి నాన్నా అమ్మకు కోపం వస్తున్నది.
నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచి పెట్టు. అన్నాడు.
కుమారా!చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగ
నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది:అన్నాడు మహాదేవుడు.
సవితి తల్లిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి బొత్తిగా నచ్చలేదు...ఏమవుతుంది?ఎక్కడకు వెళుతుంది?అంటే తనేం చెప్తాడు?బంగాళాఖాతం లోకి వెళ్ళమను.నాకేమిటి?(నదీనాం సాగారో గతి:)అని కోపంగా తన ఆరు ముఖాలతో ఆరుసార్లు చెప్పాడు.'అంభోధి,జలధి,పయోధి,ఉదధి,వారాంనిధి,వారిధి'
షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు.
ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు సంతోషం తోసింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకున్నాడు.
ఉచిత రీతిని సత్కరించాడు.