ఒక ఊరికి చివర్లో ఒక రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది.
దానికి బాగా గింజలు, ఇంకా మంచి తిండీ, పెడుతూ పెంచుతున్నాడు.
ఒకనాడు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి, ’కొక్కొరోకో’ అని గట్టిగా అరుస్తూ కూర్చుంది.
దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది.
ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందేననుకుంది.
మెల్లగా అది కోడిపుంజు నిలబడివున్న గోడ దగ్గరకు వచ్చి, "ఆహా..ఎంత బాగా పాడుతున్నావు.   మళ్లీ మళ్లీ వినాలనుంది నాకు, నీ పాటని... నేను రోజూ ఇక్కడికి వచ్చి నీ పాట వినాలనుకుంటున్నాను....
సరేనా... అని అడిగింది.
నక్క మాటలకు అప్పటికే పొంగి పోయిన కోడిపుంజు "దానికేం భాగ్యం.....తప్పకుండా  రోజూ వచ్చి వినండి. " అన్నది కులుకుతూ.
ఇక రోజూ నక్క అక్కడికొచ్చి గోడ కింద కూర్చోవటం మొదలు పెట్టింది. నక్కను చూసి గోడమీది కోడిపుంజు రెట్టించిన ఉత్సాహంతో కూతలు కూసేది.
మెల్లిగా అది కొంచెం కొంచెం చిందులేయటం కూడా అలవాటు చేసుకుంది.
 కొద్ది రోజుల్లోనే నక్కకూ, కోడిపుంజుకూ సాన్నిహిత్యం ఏర్పడింది. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది.
ఒక రోజున నక్క కోడితో అన్నది: "ఇవ్వాళ నీ ఆటా,పాట నాకు ఎంతో ఇంపుగా అనిపిస్తున్నాయి  నువ్వు అలా ఆడుతూ పాడుతూ ఉంటే నేనిట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోది..
అన్నది..
"ఓహ్! నువ్వు  భలే పొగుడుతావు  నా గానందేముంది.." అంటూనే ఒళ్ళు మరచిన ఆ కోడి కాలుజారి గోడమీది నుండి క్రింద పడిపోయింది.
అవకాశాన్ని జారవిడుచుకోని నక్క వెంటనే ముందుకు దూకి, దాన్ని నోట చిక్కించుకుని అడవిలోకి పారిపోయింది.
అందుకనే, పొగడ్తలకు లొంగకూడదు.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
మానవీయ విలువలు, స్నేహం అనే అంశాలు లోపించడం వల్ల మనం కేవలం ఇతరుల ప్రశంసల కోసమే వేచి చూస్తుంటాం. విమర్శలతో పాటు చేదు నిజాలను అంగీకరించడానికి కూడా వెనుకాడతాం. అయితే ఇలాంటి గుణగణాల వల్ల జీవితానికి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రియవాక్యప్రదానేన సర్వే తుస్యంతి జంతవః  ।
 తస్మాత్తదేవ వక్తవ్యం ! వచనే కా దరిద్రతా ॥ 
ప్రతి మనిషిలోనూ స్వాభావికపరంగానూ, వ్యక్తిత్వ పరంగానూ, శీల పరంగానూ, వ్యవహార శైలీ పరంగానూ, నడవడి పరంగానూ, శారీరక పరంగానూ ఇలాగ ఎన్నో విధాలైన లోపాలు ఉంటూ ఉంటాయి. అవి అన్నియూ నిజమే కావున వాటిని నిశ్శంకోచంగా వేలెత్తి చూపుతూ, వాటినే ప్రస్తావిస్తూ ఉంటే ఎవరికీ రుచించదు. ఇది స్వాభావికం. ప్రతి మనిషీ, తనలోని మంచిని గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలా ఆనంద పడతాడు. అలాగని ముఖ స్థుతి చేయమని అర్థం కాదు. భట్రాజులా పొగడమనీ అర్థం కాదు. ఎన్నో లోపాలతో పాటు, ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. ఏవో కొన్ని మంచి లక్షణాలూ ఉంటాయి. వాటిని ప్రస్తావిస్తే అతను సంతోషిస్తాడు. వాటిని గుర్తించారు అని గ్రహించిన తరువాత అటువంటి మంచిని మరల మరల చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనుష్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగు పడతాయి
ఈ స్వాభావిక నేపధ్యంలోనే,
ప్రజలందరూ ప్రియమైన వాక్యం వలన సంతసించుతారు.
కాబట్టి అదే మాట్లాడవచ్చు కదా! అంటే ఆ ప్రియవచన ప్రస్తావనే చేయవచ్చు కదా! “మాటలలో దరిద్రం ఎందుకు? అని తాత్పర్యం