వినాయక పద్యములు.. ...
🍁🍁🍁
"తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్".
🍁🍁🍁
తొలుత నవిఘ్న మస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవ గణాధిప లోక నాయకా!
🍁🍁🍁
తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్
🍁🍁🍁
అటుకులు కొబ్బరి పలుకులు
చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు
పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్