‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పెద్దవాళ్ళు ఆశీర్వదించడం మన సంప్రదాయం.
ఈ వాక్యం ద్వారా మానవుడు పరిపూర్ణ జీవితాన్ని గడపాలనే వేద సుభాకాంక్ష వ్యక్తమౌతుంది.
ఆయుష్షు ఒక అవకాశం. జీవించి వుంటే, ఏ క్షణమైనా మనలో హఠాత్తుగా మార్పు కలిగి, ఉత్తమ స్థితికి ప్రయత్నించగలం.
అందుకే జీవితమంత విలువైనది ఏదీ లేదు.
జీవితం విలువను వేదసంస్కృతి స్పష్టంగా, అత్యంత సమగ్రంగా తెలియజేసింది. సమస్త ఇంద్రియాలూ పుష్టిగా పనిచేస్తూ జీవితమంతా ధార్మికమైన వేధస్సుతో, ధార్మికమైన సంపాదనతో ఇహపరాలు సాధించమని వేదం బోధిస్తోంది.
మనిషికి – బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం – నాలుగు దశలు. ఈ నాలుగు పరిపూర్ణంగా అనుభవించాలి.
అంతేకానీ అకాల మృత్యువుపాల పడరాదు. ఎటువంటి బలహీనక్షణంలోనూ జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు. జీవితం మీద, ప్రేమ, రక్తి చాలా అవసరం.
సవ్యమైన ఆలోచనతో కూడిన జీవితం అవసరం. ఈ క్షణం అతికష్టంగా అనిపించినా జీవితం, మరుక్షణం అత్యంత సౌఖ్యంగా అనిపించవచ్చు. కనుక ఏ క్షణంలోనూ జీవితాన్ని ఏవగించుకోరాదు. జీవితం ఒక వరం.
బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలలో ఉండే వివిధ అనుభవాలూ, ఒక్కో అవస్థలో సాధించవలసిన విధులూ పరిపూర్తి చేసుకోవాలి.
జీవితమంతా కర్తవ్య నిర్వహణలో సాగవలసిందే. ఏ క్షణాన జీవితం ఆగిపోయినా, ఆ తరువాత చేయవలసిన కర్తవ్యాలను ఆపివేసినట్లే. కనుక పరిపూర్ణ జీవనమే ఆశించాలి.
‘వృద్ధాప్యం’ వేరు, ‘జర’ వేరు. ‘జర’ అంటే క్షీణించిపోవడం, కృశించిపోవడం. ‘వృద్ధాప్యం’ అంటే ‘పెద్దతనం’. వృద్ధాప్యం వస్తుంది – సహజంగా. కానీ ‘జర’ మాత్రం మన ప్రవర్తనలలోని లోపాల వల్లే వస్తుంది. సరియైన ఆహారవిహారాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామాలు, ఆలోచనలు, యోగాభ్యాసం – వంటివి లేకపోతే ‘వృద్ధాప్యం’ బదులు శరీరం జరాక్రాంతమవుతుంది.
మనం వృద్ధాప్యంలో కూడా జరాక్రాంతులం కాకుండా చూసుకోవాలి.
మిగిలిన మూడు అవస్థల్లోనూ కేవలం భోగానుభవమే ప్రధానం కాకుండా, సుశిక్షితమైన నియమాలను అనుసరిస్తూ వెళితే వార్ధక్యం జరాక్రాంతం కాదు.
క్షీణించిన, రోగమయ శరీరం – ‘జర’లో ఉంటుంది.
అయితే ‘జాతస్యహిధృవో మృత్యుః’ – మృత్యువు అనివార్యమైనది. దానికి ముందు అవస్థ ‘జర’. అదీ సహజంగానే వస్తుంది. ఇన్నేళ్ళూ శ్రమించి, సాధన చేసిన దేహం – ప్రకృతి సహజంగా అంతిమంగా ‘జర’కి లోనవుతుంది.
ఆ జర వచ్చాకే మృత్యువు. అంతదాకా మృత్యువును దరికి రానీయరాదు.
ఆకు రాలిపోయే ముందు పండుతుంది. వృద్ధాప్యంలో అంతిమవేళ ‘జర’వస్తుంది. అంతవరకూ జీవించవలసిందే.
ఈలోపల మృత్యువు రారాదు. ఇది మన దీర్ఘాయువును కోరుకొనే వేదహృదయాశీర్వచనం. ఆయువుకి ధర్మం ప్రధానం.
ధర్మమయమైన శ్రీరాముని పాలనలో – “పెద్దలు పిల్లలకి ప్రేతకర్మ చేయవలసిన దుస్థితి లేద’ని వాల్మీకి వర్ణించాడు.
న చస్మ వృద్ధబాలానాం ప్రేతకార్యాణి కుర్వతే(రామాయణం)
అకాల మరణాలు ఉండరాదు’ – అనే ఆకాంక్ష వుంటే ‘అకాల మరణాలకు హేతువైన అధర్మాలు ఉండరాదు’ అనే బాధ్యత, హెచ్చరిక కూడా ప్రధానం.
వృద్ధేషు సత్సుబాలానాం నాసీన్మృత్యు భయం తదా!!
ధర్మమయ రామపాలనలో వృద్ధులు బ్రతికి ఉండగా, బాలురు మరణించడం లేదు - అని రామాయణ వర్ణన.
హఠాన్మరణాలు, ప్రమాదాల వల్ల కూడా జీవితాలు నశించకూడదు. అందరూ ‘హాయిగా పూర్ణ జీవితాన్ని అనుభవించాలంటే – అందుకు అవసరమైన ధార్మిక సహజీవనం పునాది అని మరువరాదు.
సంపూర్ణ జీవితాన్ని వేదం ఆకాంక్షించిందీ అంటే, ఆ వేదం చెప్పిన ధర్మమంతా ఆ లక్ష్య సాధనకేనని గ్రహించాలి..