చిలుకలు చెప్పిన నిజం!
గంగా నదిలో పడవ నడిపి జీవిస్తుంటాడు రాంసింగ్. ఓరోజు అప్పటికే రాత్రైంది. దాంతో పడవని తీరంలో చెట్టుకు కట్టేసి, గట్టెక్కుతున్నాడు. అమావాస్య కావడంతో చిమ్మ చీకటిగా ఉంది. అయినా అలవాటైన దారే అవడం వల్ల వేగంగానే నడుస్తున్నాడు. ఇంతలో గట్టు దిగుతూ పది మంది ఎదురుపడ్డారు. తమని ఆవలి ఒడ్డుకు చేర్చమని కోరారు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్న రాంసింగ్ ఇప్పుడు నదిని దాటించడం కుదరదని చెప్పాడు. కానీ వాళ్లు ఊరుకోలేదు. తాము తొందరగా వెళ్లవలసిన పని ఉందని, ఎలాగైనా ఆవలి తీరానికి చేర్చమని ప్రాధేయపడ్డారు. సరేనని వాళ్లని ఒడ్డుకు చేర్చి, తిరిగొచ్చి పడవను కట్టేసి ఇంటి దారి పట్టాడు.
తెల్లారి నది దగ్గరికి వచ్చిన రాంసింగ్‌కు పడవలో ఓ మూట కనిపించింది. అది తన పడవలో ర్రాతి ప్రయాణించిన వారిదేమోననుకున్నాడు. ఎవరైనా అడిగితే ఇవ్వడానికి వీలుగా ఉంటుందని, ఆ మూటను ఒక పొదలో దాచాడు. రోజులు గడుస్తున్నా.. ఎవరూ ఆ మూట కోసం రాలేదు. దాన్ని అక్కడే ఉంచేస్తే ప్రమాదమని, తన గుడిసెకు తీసుకెళ్లి చూరులో దాచాడు. ఒకరోజు ఓ కోతి గుడిసె పక్కనున్న చెట్టు మీద నుంచి దభేల్మని గుడిసె మీదకు దూకింది. ఆ అదురుకు చూరులో నుంచి మూట కింద పడింది. మూటలో ఉన్న వస్తువేదో రాంసింగ్ తలకు బలంగా తగిలింది. మూటను చేతుల్లోకి తీసుకునేసరికి అది కొద్దిగా విడిపోయి, అందులో ఉన్న సొమ్ము, నగలూ బయటపడ్డాయి. రాంసింగ్ నమ్మలేకపోయాడు. ఆ మూటను ఏం చేయాలో తెలీక తికమకపడ్డాడు. మళ్లీ మూట కట్టి జాగ్రత్తగా చెక్క పెట్టెలో భద్రపరిచాడు.
పరుల సొమ్ము అనుభవించడం పాపమని అతని భార్యాపిల్లలు అన్నారు. ఎవరైనా వస్తారేమో ఇంకొన్నాళ్లు వేచి చూద్దామనుకున్నారు. నిజానికి ఆ మూట కోసం ఎవరూ రారు. ఎందుకంటే ఆ రాత్రి పడవ ఎక్కిన వాళ్లు దొంగలు. ఆ రాజ్యంలో వాళ్లు చేసిన దొంగతనాలు పెరిగిపోవడంతో జనంలో అలజడి పెరిగింది. రాజభటుల నిఘా ఎక్కువైంది. దాంతో దొంగలు అక్కడి నుంచి తప్పించుకు పారిపోవాలని చూశారు.
వాళ్లలో ఒకడు తన మూటను పడవలోనే మరిచిపోయాడు. తర్వాత గుర్తొచ్చి, గగ్గోలు పెట్టాడు. కానీ భయంతో వెనక్కి రాలేకపోయాడు. కాలం గడిచేకొద్దీ రాంసింగ్‌కు ఆ మూట గురించి దిగులు పెరగసాగింది. ఓరోజు తన మిత్రుడితో మూట గురించి చెప్పి, సలహా అడిగాడు. అప్పుడతను ‘ఆ మూటను నీ దగ్గర ఉంచుకుంటే పోను పోను ఏదైనా ఇబ్బంది రావచ్చు. దాన్ని మహారాజుకు సమర్పించుకుంటే సమస్య తీరుతుంది’ అన్నాడు. వాళ్ల మాటలను చెట్టు మీదున్న చిలుకల జంట వింది. రాంసింగ్ నిజాయతీ వాటికి నచ్చింది.
రాంసింగ్ మూటను తీసుకుని కోటకు చేరుకున్నాడు. చిలుకలు అతన్ని వెంబడిస్తూ వచ్చాయి. రాజభటులు అతన్ని ఆపి ‘ఏం పనిమీద వచ్చావ్?’ అని అడిగారు. రాంసింగ్ విషయం చెప్పగానే భటులకు దుర్బుద్ధి పుట్టింది. వెంటనే ‘చూడు బాబూ! రాజుగారు తీరిక లేకుండా ఉన్నారు. ఆ మూటను మాకిస్తే వారికి అందజేస్తాం అన్నారు. సరేనని వాళ్లకిచ్చేశాడు రాంసింగ్ అమాయకంగా..
అది చూసిన చిలుకలకు రాజభటుల మీద కోపం వచ్చింది. వెంటనే అవి కోటలోకి ఎగిరి వెళ్లాయి. ఆ సమయంలో రాజు తోటలో విహరిస్తున్నాడు. ఇవి ఓ చెట్టు మీద వాలి ‘చూశావా! ఆ పడవవాడికి ఉన్న నిజాయతీ రాజభటులకు లేదు. ఇలాంటి వారి వల్ల రాజుగారికి ఎప్పటికైనా ప్రమాదమే!’ అని మాట్లాడుకోసాగాయి. ఆ మాటలు విన్న రాజు దేని గురించి మీరు మాట్లాడేది. కాస్త వివరంగా చెప్పండి అని చిలుకల్ని కోరాడు. అవి జరిగిందంతా రాజుకు వివరించాయి. ఉగ్రుడైన రాజు భటుల్ని పిలిచి గద్దించేసరికి తప్పును ఒప్పుకున్నారు. వారిని బంధించమని ఆదేశించాడు రాజు. రాంసింగ్‌ను ప్రవేశ పెట్టమన్నాడు. ఆ తర్వాత రాంసింగ్ చెప్పినదంతా విన్న రాజు అతని నిజాయతీకి సంతోషించి.. ఆ నగల్ని, సొమ్మును నువ్వే తీసుకో’ అని ఆజ్ఞ ఇచ్చాడు.
కానీ రాంసింగ్ అందుకు నిరాకరించాడు. ‘రాజా! వీటితో మా కుటుంబం హాయిగా ఉండొచ్చు. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి నాకు ఈ మూట బదులు కొత్త పడవ ఇప్పించండి. నా పడవ చిల్లులు పడి పాతదైపోయింది. అలవాటైన పని చేసుకుంటూ ఆనందంగా బతుకుతాం’ అన్నాడు. అతని నిజాయతీ చూసి రాజుకి ముచ్చటేసింది. అలాగే! అంటూ తను కోరిన కొత్త పడవకు కావాల్సిన ధనాన్ని ఇచ్చి పంపాడు రాజు.
- ఎస్. హనుమంతరావు