బాల పంచపది_74
తేది:11.09.2022
అంశం:చెరువు
పేరు: కాటెగారు పాండురంగ విఠల్
అలుగు పారే పాటే సుప్రభాతము
చెరువు గాలే మలయమారుతము
అలల శబ్దాలే ఓంకార నాదము
పక్షుల కిలకిల గంటానాదము
చెరువు ఊరికి ఆదరువు విఠల!
ఈ గట్టున పిల్లల కేరింతలు
ఆ గట్టున పెద్దల జలకాలు
ఆవల యువతుల సంభాషణలు
ఈవాల యువకుల సరదాలు
చెరువు ఊరికి ఆదరువు విఠల!
పశు పక్షులకు నీటి వనరులు
పంట పొలాలకు జల సిరులు
మత్తడిదూకే అందాల ఝరులు
చెరువు గట్టున సుందర తరులు
చెరువు ఊరికి ఆదరువు విఠల!
తెల్ల తెల్లని కొంగల వరుసలు
నల్ల నల్లని బాతుల బారులు
సల్ల సల్లని చిరు చిరు గాలులు
అల్ల అల్లని అలల సవ్వడులు
చెరువు ఊరికి ఆదరువు విఠల!
పసిడి పంటలు పండాలన్నా
ఊరి ప్రజల ఆకలి తీరాలన్నా
కరువు కాటకాలు వీడాలన్నా
సుఖ సంతోషాలు విరియాలన్నా
చెరువు ఊరికి ఆదరువు విఠల!
తొలి సంధ్యలో సువర్ణ కాంతులు
మలి సంధ్యలో మనోహర దృశ్యాలు
మధ్యాహ్నం మిళ మిళ మెరుపులు
రాతిరి వేళ నిర్మల సౌందర్యాలు
చెరువు ఊరికి ఆదరువు విఠల!
ఉదయ కిరణాలతో నవ్యత
లేలేత కిరణాలతో రమ్యత
ఎర్రెండ కిరణాలతో భవ్యత
వాలే కిరణాలతో దివ్యత
చెరువు ఊరికి ఆదరువు విఠల!
తాగునీటి వనరై తనివి తీర్చును
సాగునీటి వనరై సాయపడును
వాగు వంక నదులై జతచేరును
బాగు కోరి ఊరికుపకారి ఔను
చెరువు ఊరికి ఆదరువు విఠల!
కార్తీక మాస దీపాల వరుసలు
ఘన గణనాథ నిమజ్జనములు
భవ్య బతుకమ్మ విసర్జనములు
మొలక పండుగ మహార్పణలు
చెరువు ఊరికి ఆదరువు విఠల!
శివ లింగానికి జలాభిషేకము
ఆంజనేయునికి బిందె సేవలు
శ్రీరాములోరికి నిత్యాభిషేకము
అమ్మతల్లులకు నీటి అర్పణలు
చెరువు ఊరికి ఆదరువు విఠల!