అక్షర యజ్ఞంలో ప్రమిదలం..!!
నాలాంటి కవులు నాకు ఎందరో తోడుగా
తలల మీద సత్కారపు కిరీటాలు ధరించి
కీర్తి ప్రతిష్టల కోసం నిత్యం పాకులాడుతుంటాం
జ్ఞాపకాల్ని విశ్వ వీధుల్లో మోస్తూ తిరుగుతున్నాం.
అక్షరాలతో నేసిన శాలువాలను భుజాలపై మోస్తూ
బరువైన భావాల జ్ఞాపికలు చేతులతో సృజిస్తూ
సాహిత్య వీధుల్లో అక్షరాలకు సత్కారాలు ఆశిస్తూ
కవినంటూ గర్వంగా చెప్పుకుంటూ సాగుతున్నాం..
రాసిన రాతల్లో ప్రశంస కోసం పరితపిస్తూ
రెండవ ముఖముతో ఎందరినో నిందిస్తూ
ప్రత్యేక గుర్తింపుల కోసం నిత్యం తప్పిస్తూ
కవి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నాం..
మహా కవుల సరసన నిలవాలని ఆరాటంతో
అనునిత్యం అక్షరాలతో నిత్యం పోరాటం చేస్తూ
సాహితీ జగత్తులో మనకంటూ ఒక పేరా ఉండాలంటూ
నేల నుంచి నింగి వరకు అక్షరాలు పేరుస్తూ ఉన్నాం...
అక్షర యజ్ఞంలో ప్రమిదలమై వెలుగు పంచుతూ
సమాజాన్ని చైతన్య పరుస్తూ జాడ్యం తొలగిస్తూ
కృష్ణశాస్త్రి లా ఊహల్లో నిత్యము విహరిస్తూ
శ్రీశ్రీలా సమాజ రుగ్మతలను నిరసిస్తున్నాం...
ప్రకృతిని అణువణువు మూడో దృష్టితో పరిశీలించి
నేల గర్భం నుంచి విత్తు వచ్చినట్లు భావం ఉబికి పైకి వచ్చే
ప్రసవ వేదనతో సాహిత్యము ఉద్భవించే
మస్తిష్కపు ఆలోచనలలో పురుడు పోసుకొనే..
రాయడం అంటే నాలుగు వాక్యాలు కానే కాదు
సృజించి అనుభవించి ఆకలింపు చేసుకుంటూ
అక్షరాల మర్మమెరిగి ప్రయోగించే పదజాలం
నోటిలో జారిన పదం అందంగా మలిచే ప్రయత్నమే కవిత్వం..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235