రాయాలని ఉంది మర్మము తెలుసుకొని
తల్లి కడుపులో గుర్తులేని మధుర క్షణాలను
తొలి పొద్దు పువ్వుల రెక్కల విన్యాసాలను
పుడమి నుంచి బయటపడ్డ విత్తనపు రహస్యాలను...
రాయాలని ఉంది కవితలు కమ్మగా
గుడ్డివారి చూపులో అందమైన లోకాన్ని
చెవిటివారు విన్న శబ్దాల లావణ్య విన్యాసాలను
మూగవాని మౌనపు భాషలోని సొగసులను....
రాయాలని ఉంది చక్కని కవిత్వం
కనపడని అందాలను కవిత్వానికి చుట్టి ఇవ్వాలని
మాటలు నేర్చిన ఆదిమానవుని మాటల మాధుర్యాన్ని
అరుపులో పుట్టిన పదాన్ని కవిత్వమై వర్ణించాలని...
రాయాలని ఉంది కవితలోని లావణ్యం
భావ కవిత్వములోని స్వర్గ లోకపు సౌఖ్యం
భక్తి తత్వాన్ని పేదవానికి ముడి కట్టి వినిపించి
విప్లవ కంఠంలో పలికించే ధ్వని ఆస్వాదించాలని..
రాయాలని ఉంది రచయితగా బాధ్యతతో
పేదవాడి పిడికిట్లో ఎర్రటి మెతుకుల భవితవ్యం
శ్రమ జీవి చెమట లోని జీవన సౌందర్యం
కర్షక వీరుని కన్నుల్లో దాగిన నిప్పు కణాలను..
రాయాలని ఉంది ప్రాచీన నవీన పోకడలతో
ప్రాచీన యుగములోని సామాన్యుడి సాహసాన్ని
మధ్యయుగములో యుద్ధ వీరుల విన్యాసాల్ని
ఆధునిక మానవుడు సృష్టించిన నింగి రహస్యాలను...
రాయాలని ఉంది రాతలు ఒక నూతనత్వం
పరులకు దొరకని మాటను నా మాటగా చెప్పాలని
ఎవ్వరూ రాయని పదాన్ని సృష్టించాలని
కవిత వినీలాకాశములో తారాజువ్వల వెలగాలని..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235