ఋతువు ప్రకారము వీచే గాలులే
ఋతుపవనాలు . పవనము అంటే గాలి , ఋతువులు అంటే కాలము ; కాలాన్ని బట్టి అనగా వేసవి కాలము ,
వర్షాకాలము , శీతాకాలము లలో వీచే గాలులు
ఒక్కోదిశలో వీస్తాయి.
వేసవిలో
ఎండలు ఎక్కువగా ఉంటే తెగ బాధపడిపోతాం. కాని ఎండలు ఎంత ఎక్కువగా ఉంటే వానలు అంత
బాగా పడతాయని తెలుసా? వేసవిలో సూర్య కిరణాలు భూమ్మీద ఎలా పడతాయో,
సముద్రం మీద కూడా అలాగే పడతాయి. కానీ సముద్రం కన్నా భూమి బాగా
వేడెక్కుతుంది. భూమితో పాటు దానిని ఆనుకుని ఉన్న గాలులు కూడా వేడెక్కుతాయి.
ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ గాలులు వ్యాకోచించి తేలికై, పైకి పోతాయి.
అలా పైకి వెళ్లే వేడి గాలుల స్థానాన్ని భర్తీ చేయడానికి సముద్రం పై నుంచి గాలులు
భూమి పైకి సమాంతరంగా వీస్తాయి. ఈ గాలులు తేమగా, ఎక్కువ
నీటియావిరితో నిండి ఉంటాయి. ఎందుకంటే ఎండ వేడికి సముద్రాల నీరు ఎక్కువ ఆవిరవుతుంది
కదా? ఆ నీటి ఆవిరితో ఈ గాలులు నిండి ఉంటాయన్నమాట. ఈ గాలులే
రుతుపవనాలకు కారణం.
వేసవి
కాలంలో సముద్రాల్లో ఎక్కువ నీరు ఆవిరవుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో పీడనం ఎక్కువగా
ఉంటుంది. అదే సమయంలో నేల (land) వేడెక్కడం వల్ల ఆ ప్రాంతాల్లో గాలులు
వ్యాకోచించి పీడనం తక్కువగా ఉంటుంది. గాలులెప్పుడూ అధిక పీడన ప్రాంతాల నుంచి
అల్పపీడన ప్రాంతాలకు వీస్తాయని తెలుసుగా? ఇలా పీడనాల్లో
వ్యత్యాసాలు బాగా ఎక్కువైన పరిస్థితుల్లో సముద్రాల మీద నుంచి గాలులు నేల వైపు
బలంగా వీచడం మొదలెడతాయి. సాధారణంగా ఈ పరిస్థితులు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.
ప్రతి
ఏటా వేసవి కాలంలో దక్షిణ ఆసియాలోని హిందూ మహా సముద్రం నుంచి భూభాగం వైపు, శీతకాలంలో
భూమి నుంచి సముద్రంవైపు వీచే గాలులనే రుతుపవనాలంటారు. సముద్రం నుంచి భూభాగం వైపు
వీచే గాలులను నైరుతి రుతు పవనాలంటారు. శీతకాలంలో భూమి నుంచి సముద్రం వైపు వీచే
గాలులను ఈశాన్య రుతుపవనాలు అంటారు.
మన
దేశంలో 90 శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల వల్లనే పడతాయి. జూన్ నెల మధ్యలో పయనించే
ఈ గాలులను హిమాలయ పర్వతాలు అడ్డుకోవడంతో వర్షాలు కురుస్తాయి. ఇందుకు విరుద్ధంగా
శీత కాలంలో మధ్య ఆసియాలో, ఉత్తర భారతంలో సముద్ర తీర ప్రాంతం
నుంచి అతి చల్లని పొడిగాలులు తీవ్రంగా వీస్తాయి. సముద్ర జలాలతో పోలిస్తే దానికి
ఆనుకుని ఉండే భూమి త్వరగా వేడెక్కడమే కాకుండా, త్వరగా
చల్లబడుతుంది కూడా. దక్షిణ దిశలో ఉండే హిందూ మహాసముద్రం, తూర్పున
ఉండే పసిఫిక్ మహా సముద్రాలతో పోలిస్తే, మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాలు వేసవిలో బాగా వేడెక్కుతాయి. అందువల్ల ఆయా భూభాగాలపై
ఉండే గాలి వేడెక్కి, వ్యాకోచిస్తుంది. తద్వారా దాని పీడనం
తగ్గుతుంది. గాలులు ఎప్పుడూ తక్కువ పీడనం ఉన్న వైపు వేగంగా ప్రయాణిస్తాయని
తెలుసుకదా? అందువల్లనే సముద్రాల మీంచి గాలులు వేగంగా
భూభాగాలపైకి వీస్తాయి.
ఇక శీత కాలంలో ఆసియా
భూభాగమంతా త్వరగా చల్లబడడం వల్ల దానిని ఆనుకుని ఉన్న సముద్రపు ఉష్ణోగ్రతే ఎక్కువగా
ఉంటుంది. అంటే భూమిపై ఉన్న గాలులు సంకోచిస్తే, సముద్రాలపై ఉన్న గాలులు
వ్యాకోచిస్తాయన్నమాట. సముద్రాలపై పీడనం తక్కువగా ఉండడం వల్లభూమిపై గాలులు ఆ దిశగా
ప్రయాణిస్తాయి. ఇలా శీతకాలంలో పొడిబారిన తీరప్రాంతం నుంచి గాలులు (ఈశాన్య
రుతుపవనాలు) సముద్రం వైపు వీస్తాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఎక్కువగా దక్షిణ,
తూర్పు ఆసియాలపై ఉండడానికి కారణం వాటి భూభాగాల వైశాల్యం ఎక్కువగా
ఉండడమే