_*ఏషియన్ లూయీపాశ్చర్ "డా||యల్లాప్రగడ సుబ్బారావు" జయంతి సందర్భంగా...*_
ఆంధ్రుడైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మనరాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి, మద్రాసులో వైద్య విద్యను అభ్యసించి, అమెరికాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది, మానవజాతి భవితవ్యానికి, వారిని రోగ విముక్తులను చేయడానికి తన అనన్య సామాన్య ప్రతిభాపాటవంతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. మానవజాతికి మహోపకారం చేసిన వ్యక్తులలో డాక్టర్యల్లాప్రగడ సుబ్బారావు ప్రముఖులు. అందుచేతనే '' ఏషియన్ లూయీపాశ్చర్'' గా సుబ్బారావు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడ్డారు.
వైద్యశాస్త్రంలో అందులోనూ ముఖ్యంగా లివర్‌పై పరిశోధన ఎంతో పట్టుదలతో, దీక్షతో కొనసాగించి కొత్త మందులను కనుగొని మానవజాతికి మహోపకారం చేశాడు.
అందుచేతనే వైద్యశాస్త్ర చరిత్రలో డాక్టర్ సుబ్బారావుకు ఈనాటికీ విశిష్ట స్థానం ఉంది.
అమెరికాలో లీడర్లి కంపెనీ పరిశోధనలకు రూపురేఖలు దిద్ది, ఆ సంస్థ పరిశోధనా రంగా నికి డైరెక్టరుగా వ్యవహరించి, వందలాది మంది వైద్య శాస్త్రజ్ఞుల పరిశోధనలకు సారథ్యం వహించిన మొట్టమొదటి ఏషియన్ యల్లాప్రగడ. 53 సంవత్సరాల వయస్సులోనే యల్లాప్రగడ మరణించినా, ఈనాటికీ ఆయన చేసిన మౌళిక పరిశోధనలు, కనుగొన్న మందుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రాణప్రదాతగా ఉన్నాడు. తెల్లవాళ్ళ ఆధిక్యత గల పాశ్చాత్య ప్రపంచంలో భారతీయుడైన యల్లాప్రగడ అన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంటే దానికి కారణం తాను పేరు ప్రఖ్యాతులను లెక్కచేయకుండా నిరంతరం తన పరిశోధనలో మునిగి తేలుతూ మానవజాతిని రోగాల నుండి విముక్తి చేయడానికి అహర్నిశలూ కృషి చేయడమే.
1895 జనవరి 12న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా ఆఫీసుకు దగ్గరలో వున్న ఒక సామాన్య గృహంలో జన్మించాడు. తండ్రి జగన్నాథం, ఆ తాలూకా ఆఫీసులో 'హెడ్‌క్లర్క్ తల్లి వెంకమ్మ గృహిణి. సుబ్బారావు పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లాలో ముక్తేశ్వరరావు 3 మైళ్ళ దూరంలో ఉన్న కొత్తూరు జన్నాధపురం కరణాలు. చిన్నప్పటి నుండీ స్వతంత్ర భావాలు గల సుబ్బారావు కాశీ వెళదామని, వేదాంతం అధ్యయనం చేద్దామని యిల్లు వదిలి బయలుదేరారు. తల్లి బ్రతిమిలాడి వెనక్కు తీసుకువచ్చింది.
కలకత్తా వెళ్ళి రామకృష్ణ మిషన్‌లో చిన్న వయస్సులోనే చేరదామని ప్రయత్నిస్తే ఆ బాలుడిని తల్లిదండ్రులు అనుమతి లేనిదే చేర్చుకోమన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారావు దృష్టి వేదాంతం నుండి మానవసేవ చేయడానికి సాధ్యమైన వైద్యశాస్త్రం వైపు మళ్ళింది. నరసాపురం హైస్కూల్లో చదువు ప్రారంభించి మద్రాసు హిందూ హైస్కూలులో మెట్రిక్యులేషన్ మూడో ప్రయత్నంలో పాసయ్యాడు. తండ్రి చనిపోవడంతో తల్లి తన వస్తువులను తాకట్టుపెట్టి వైద్యశాస్త్రం చదివించింది. 1918లో ఆ వైద్య విద్యార్థికి 12 ఏళ్ళ బాలికను యిచ్చి వివాహం చేశారు.
*సుబ్బారావు ఆఖండ ప్రజ్ఞాశాలి, ఫొటోగ్రాఫిక్ మెమరీ. ఒక్కసారి చదివితే చాలు. అన్ని సబ్జెక్టులూ బాగా పాసయినా, సర్జరీలో పాశ్చాత్య క్రైస్తవ ఉపాధ్యాయునికి ఇతనంటే గిట్టకపోవడంతో ఫెయిల్ చేశారు. దానితో యం.బి.బి.యస్ బదులు యల్.యం.యస్ డిగ్రీ మాత్రం లభించింది.*
అయినా అమెరికాలో పరిశోధన చేయడానికి ఆ డిగ్రీ సరిపోతుందని గుర్తించి, అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో సమశీతోష్ణి మండల వ్యాధుల గురించి పరిశోధనకు పూనుకున్నాడు. ఆ సంవత్సరమే తన అన్నలిద్దరూ స్ఫ్రూవ్యాధితో, నీళ్ళ విరోచనాలు, డయేరియాతో చనిపోయారు. *ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని మేళవించి పరిశోధన చేస్తే స్ఫ్రూ వ్యాధిని నిరోధించ వచ్చునని పరిశోధన చేసి విజయం సాధించాడు. తనకి స్కాలర్షిప్ లేకపోయినా, 1923లో గర్భవతి అయిన తన భార్యకు నచ్చజెప్పి కడసారి ఆమెను చూచి అమెరికా వెళ్ళి రిసెర్చిలో మునిగిపోయాడు. బయోకెమిస్ట్రీలో నిష్ణాతుడయ్యాడు. అమెరికా వెళ్ళిన ఒక్క సంవత్సరంలోనే అతని పేరు మారుమ్రోగింది.*
ఫాస్పరస్‌ను అంచనా వేయడానికి సుబ్బారావు రూపొందించిన పద్దతికి తన ప్రొఫెసర్ పేరు జోడించి ''ఫ్రిస్క్-సుబ్బారావు మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫార్ఫరస్'' అని నామకరణం చేశాడు.
1924 డిసెంబర్ 29న అమెరికన్ సొసైటీ ఆఫ్ బయలాజికల్ కెమిస్ట్స్ మహాసభలో అతని ప్రదర్శనను చూపించాడు. దానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే 1925లో వెలువడిన బయోకెమిస్ట్రీ పుస్తకాలన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఆ నూతన ఆవిష్కరణను సవివరంగా పేర్కొనడం జరిగింది. ఆ కాలంలో మనదేశంలో తెల్ల-నల్ల తేడా ఎంత ఎక్కువగా ఉండేదంటే సుబ్బారావు హార్వర్డ్‌లో డాక్టరేట్ చేసినా కలకత్తాలోని ఇంపీరియల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో అతను నల్లవాడు కనుక ప్రొఫెసర్ షిప్ ఇవ్వలేదు. దానితో అమెరికాలోనే ఉండిపోయి తన పరిశోధనలు కొనసాగించాలని నిశ్చయించాడు.
అమెరికాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొం టూ, లివర్‌పై పరిశోధనలు కొనసాగించి, ఎన్నో క్రొత్త విషయాలు కనుగొన్నాడు. *కాలేయంపై విస్తృతంగా పరిశోధన జరిపి రక్తస్రావం నిరోధించడానికి కె-1 విటమిన్‌ను రూపొందించాడు.*
*అదే విధంగా విటమిన్-జి రూపొందించడానికి హార్వర్డ్‌లో 15 సంవత్సరాలు పరిశోధన జరిపాడు.*
*పాండురోగమైన బెరి బెరి వ్యాధి మనరాష్ట్రం లో ఎక్కువగా ఉండేది.దీనిని ఆరికట్టడానికి ''థియామిన్'' విటమిన్‌ను కూడా సుబ్బారావు కనుగొన్నాడు.పరిశోధన తనదైనా పేటెంట్ల విషయంలో వచ్చిన వివాదం వల్ల సుబ్బారావుకు తగినంత ఖ్యాతి దక్కలేదు.*
*అదే విధంగా "దిప్తీరియా'' (కంఠసర్పి) నివారణకు కూడా సుబ్బారావు పరిశోధన కొనసాగిం చారు. కాలేయంపై అతను చేయని పరిశోధన లేదు. లివర్ ఎక్స్ట్రాక్ట్ను రూపొందించడంలో కృషి చేశాడు. హార్వర్డ్‌లో 15 సంవత్సరాలలో కాలేయం, విటమిన్లు, పోషకాహారం పై ఎన్నో మౌళిక పరిశోధనలు జరిపాడు.1940లో ఆ యూనివర్సి టీని వదిలి లీడర్లీ కంపెనీ ఆధ్వర్యం లో ఫార్మాస్యూటికల్ పరిశోధనతో బయటకు వచ్చాడు. వందలాది మంది నిష్ణాతులైన పరిశోధకులు అతనిక్రింద పనిచేశారు.*
లీడర్లీ లేబరేటరీలకు అసోసియేట్ డైరెక్టరుగా బాధ్యత లు స్వీకరించిన మొట్టమొదటి ఏషియన్ సుబ్బారావు, విటమిన్లపై తీవ్రంగా పరిశోధన కొనసాగించాడు.
*యాంటీబయాటిక్స్ మందుల రూపకల్పనలో సుబ్బారావు గొప్ప పరిశోధన జరిపాడు. 1942లో లీడర్లీ కంపెనీ రీసెర్చి డైరెక్టరుగా అత్యున్నత స్థానాన్ని అధిగమించాడు. సుబ్బారావు ఫోలిక్ యాసిడ్‌పై కొనసాగించిన కృషి ఎంతో మంది మరణానికి కారణమైన స్ఫ్రూ జబ్బు నివారణకు కారణమైంది. ఇది వైద్య విజ్ఞాన పరిశోధనలో ఒక విశిష్ట ఘట్టం.ఫోలిక్ యాసిడ్ రూపొందించడంతో సుబ్బారావు ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తం అయింది.*
*అదే విధంగా బోదకాలు రావడానికి కారణాలు పరిశోధించి ఫైలేరియాను నివా రించడంలో అద్వితీయ కృషి సల్పాడు. అంతేకాదు, యాంటీ బయోటిక్స్‌పై పరిశోధన చేసి, వ్యాధి నిరోధానికి రూపకల్పన చేశాడు. యాంటి బయోటిక్స్ చరిత్రలో ఆరోమైసిన్ కనుగొనడం ఒక అపూర్వమైన విషయం. దీనినే వైద్యపరిభాష లో క్లోరో టెట్రాసైక్లిన్ అంటారు.*
*న్యూయార్క్‌లో వైద్య శాస్త్రజ్ఞుల మహాసభలో తాను కనుగొన్న ఆరోమైసిన్ గురించి వివరించిన రెండు వారాల లోనే సుబ్బారావు 1948 ఆగస్టు 7వ తేదీ అర్థరాత్రి న్యూయార్క్‌లో నిద్రలోనే కన్నుమూశాడు. ప్రపంచంలో ప్రముఖ పత్రికలన్నీ అతని మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.*
*యల్లాప్రగడ దశాబ్దాలు అమెరికాలో వున్నా భారతీయ పౌరునిగానే వుండి తన దేశాభిమానం చాటాడు. మహాత్మాగాంధీపై అభిమానంతో చాలా కాలం ఖద్దరు బట్టలే ధరించాడు. అఖండ ప్రజ్ఞాశాలి యల్లాప్రగడ స్మారకార్థం మనదేశం పోస్టేజిస్టాంపు విడుదల చేసింది. యల్లాప్రగడ సుబ్బారావు జీవితం యువతకు స్ఫూర్తిదాయకం.*
యావత్ జీవితాన్ని నిస్వార్థంగా వైద్యశాస్త్ర పరిశోధనలకే అంకితం చేసిన మహామనిషి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. *స్వయంగా ఎన్నో మందులు కనుగొన్నా ఒక్క మందుకు కూడా పేటెంట్ హక్కు అడగని గొప్ప ఉదాత్తుడు డాక్టర్ సుబ్బారావు.*