✳రక్తపు మరకలే కాదు, చెర్రీ పండ్లు, మద్యం మరకలు బట్టలపై పడినపుడు వాటిని మామూలు డిటర్జెంట్లతో తీసేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పదార్థాలలోని అణువులు డిటర్జెంట్లోని అణువులతో కలిసి కరిగిపోవు. ముఖ్యంగా రక్తపు మరకలను వెంటనే జలీకరణం (dilute)చేసి ఉతకకపోతే రక్తపు అణువులు పొడిబారి బట్టలలోని పోగుల మధ్య చిక్కుకుపోతాయి. కొన్నిసార్లు ఇళ్లలో ఉండే ఆస్పిరిన్, ఉప్పు, ఇథైల్ ఆల్కహాల్, ప్రత్యేకంగా తయారైన డిటర్జెంట్లు కొంతమేర రక్తపు మరకలను తొలగించినా అవి పూర్తిగా పోవు. ఆ మరకలలో 42 డిగ్రీల సెల్సియస్ వద్ద రక్తం గడ్డకట్టే ప్రొటీన్ అణువులు ఉండడంతో వాటిని తొలగించడానికి వేడినీటిని వాడితే అవి బట్టలకు మరీ దృఢంగా అంటుకుపోతాయి. కానీ ఆ మరకలను కొన్ని స్టెయిన్ రిమూవర్స్తో కనబడకుండా చేయవచ్చు. ఈ పదార్థాలు అత్యంత ప్రతిభావంతమైన రసాయనిక చర్యలను జరిపే ఆక్సిజన్ అణువులను విడుదల చేయడం వల్ల అవి మరకలలోని అణువులతో కలిసి వాటిని ఏ రంగూ లేని వాటిగా మారుస్తుంది. అందువల్ల ఆ ప్రాంతంలో బట్టల రంగు కొంత మేర తగ్గుతుంది. ప్రాచీన కాలంలో మరకలు పోవడానికి బట్టలను తడపకుండా ఆరుబయట ఎండబెట్టేవారు. సూర్యరశ్మిలోని తక్కువ తరంగదైర్ఘ్యం గల వికిరణాలు ఆ మరకలలో ఉండే ఆక్సిజన్ అణువులను విడుదల చేయడంతో కొన్ని రకాల మరకల గాఢత తగ్గేది.