పూర్వం ఒక రాజుగారి తల్లి
చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు
మామిడి పండ్లు తినాలని వుంది తెప్పించమని
అడిగిందట.
అది మామిడి పండ్ల కాలం
కాకపోవడము తో ఎక్కడా పండ్లు
దొరకలేదట.ఆమె మామిడి పళ్ళు తినకుండానే
చనిపోయింది.రాజుగారికి తన తల్లి చివరి కోరిక
తీర్చలేక పోయానే అని బాధపడుతూండే
వాడట.
దురాశా పరుడైన ఆయన పురోహితుడు
రాజా! మీరు దిగులు చెంద వలిసిన అవసరం
లేదు.ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి
సంవత్సరమూ ఆవిడ తిథి నాడు
బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు
దానం చేయ వచ్చు.
అని చెప్పాడట.రాజుకు అది
నచ్చింది.రాజుతలుచుకుంటే దెబ్బలకు కొదువా
అన్నట్టు
బంగారు మామిడి పళ్ళు తయారైనాయి.ఆవిడ
తిథి నాడు అందరు బ్రాహ్మణు లకూ తలో
బంగారు మామిడి పండు దొరికింది.
మంత్రి గారికి
మాత్రం యిది నచ్చలేదు.ప్రతి
సంవత్సరమూ యిలా యిస్తూ పోతే ఖజానా ఖాళీ
అవడం ఖాయం.అని రాజుగారి విదూషకుడిని
పిలిపించి దీని కేదైనా పరిష్కారం చెప్పు.అని
అడిగాడు
అతను సరే ననిమంత్రికి ఒక వుపాయ చెప్పి
పంపించాడు.
మంత్రి తన తల్లి ఆబ్దికం నాడు
నేనూ ఆవిడ
చివరి కోర్కె తీర్చదలుచుకున్నాను .అని
ప్రకటించాడు.బ్రాహ్మణు లంతా సంతోష
పడ్డారు.రాజుగారు బంగారు మామిడి పడ్లు
యిచ్చారు యింక ఈ మంత్రి కూడా ఆల్లాంటి
దేదో యిస్తాడు అని సంబర పడ్డారు.
మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే
వచ్చింది.
ఆయన ఒక్కొక్క బ్రాహ్మణు డినీ
లోపలకు పిలిచి యినప గరిట కాల్చి వాత పెట్టి
పెరటి దారిన వారిని పంపించసాగాడు.వాళ్ళు
మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ
వెళ్ళిపోయారు.వాళ్ళు వెళ్లి రాజుగారికి
ఫిర్యాదు చేశారు.రాజు మంత్రిని పిలిపించి
యిదేమి పని అడిగాడు.
అప్పుడు మంత్రి మహారాజా! మా అమ్మ
కీళ్ళవాతం తో చనిపోయింది.చనిపోయే ముందు
నాయనా దీనికి వాత ఒక్కటే మందు యినుప
గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది.నా
భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ
చనిపోయింది.
మరి కొడుకు గా ఆవిడ ఆఖరి కోరిక
తీర్చడం నా విధి కదా! అందుకని మీరు చూపిన
దారినే నేను నడిచాను. అన్నాడు రాజుకు
జ్ఞానోదయ మయింది.అప్పటినుండీ బంగారు
మామిడి పండ్ల దానం రద్దు చేశాడు.