మహా శివరాత్రి పర్వ దినాన తెల్లవారకముందే
ఒక బ్రాహ్మడు, సముద్ర స్నానానికి వెళ్ళాడు.
అప్పటికింకా ఆటే జనం సముద్ర తీరాన్ని చేరలేదు.
బ్రాహ్మడి దగ్గర ఒక రాగి చెంబున్నది.
దాన్ని ఒడ్డున విడిచి తాను సముద్రంలోకి దిగితే
ఎవరైనా చేతివాటు వెయ్యగలరని భయపడి , బ్రాహ్మడు
తన రాగి చెంబుని ఇసుకలో పూడ్చి గుర్తుగా ఉంటుందని
అక్కడ ఇసుకతో ఒక లింగాకారం తయారు చేసి
తరువాత స్నానానికి వెళ్ళాడు.
ఆ సమయానికి స్నానం కోసం అక్కడ చేరిన వాళ్ళు
శివరాత్రి నాడు ఇసుక లింగం తయారుచేసి స్నానం చేస్తే
పుణ్యం కాబోలని తాము కూడా ఇసుక లింగాలు చేసి
సముద్రంలో దిగారు.
వారిని చూసి వీరు, వీరిని చూసి ఇంకోరూ,
ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చినవారంతా
ఒడ్డున వేలకు వేల సంఖ్యలో ఇసుక లింగాలు తయారు
చేసి సముద్రంలో దిగడం వల్ల, బ్రాహ్మడు తిరిగి వచ్చి
తాను చేసిన లింగం ఏదో పోల్చుకోలేకపోయాడు.
రాగిచెంబు కాస్తా పోనేపోయింది !