తూర్పుకొండల దగ్గర సత్యపురం అనే గ్రామం ఉండేది. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉండేది. పచ్చని పైర్లు, పక్షుల కిలకిలరావములు ఎల్లవేళలా ఊరికి ఎంతో ఆహ్లాదాన్నిస్తుండేవి. ఊరి బయట, ఓ వేపచెట్టు ఉంది. దాని చుట్టూ ఓ పెద్ద అరు గుని కూడా కట్టించారు ఆ గ్రామ పెద్దలు. ప్రొద్దున్నే కొండలవైపు వ్యాహ్యాలికెళ్లే కరుణాకరుడికి ఈ అరుగు బాగా నచ్చింది. తెల్ల వారుఝామున వచ్చి సూర్యోదయానికిముందే ఓ గంట ధ్యానం చేసుకొంటే చక్కగా ఉంటుందే అనుకొన్నాడు.
ఆస్తినంతా కొడుకు లిద్దరికి ఇచ్చేసి ప్రశాంతంగా జీవిస్తున్నాడు కరుణాకరుడు. అతని అధ్యాత్మిక జీవితానికి భార్య కాని, కొడుకులుగాని కోడళ్ళుగాని అడ్డు చెప్పేవారుకాదు. అందుకే అనుకొన్నదే తడవ్ఞగా మరుసటి రోజు సూర్యోదయానికి పూర్వమే ఊరిబయటకెళ్ళాడు. అరుగు మీద కూర్చున్నాడు. చెట్టువేసిన వారికి, అరుగు కట్టించినవారికి, కట్టిన కూలీలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు మనసులో. ధ్యానం చేయాలని సంకల్పించి పద్మాసనం వేసుకొని ధ్యానంచేయడం ప్రారంభించాడు. అలా ఓ అర్థగంట ప్రశాంతంగా గడచిపోయింది. మనస్సులో ప్రశాంతత చోటుచేసుకోసాగింది.
మధురమైన అనుభూతికి గురవుతున్న సమయంలో కావ్..కావ్.. కావ్..అంటూ ఓ కాకి భయంకరంగా అరవడం ప్రారంభించింది. ఒక్కసారిగా వచ్చిన ఆ అరుపుతో ప్రశాంతతకు భంగం వాటి ల్లింది కరుణాకరుడికి. ధ్యానంలోనుండి బయటి కొచ్చాడు. కాకి మీద కోపం వచ్చింది. ఆ ప్రశాంతత సమయంలో కోపం రాకూడదు కాని వచ్చింది. కరుణాకరుడు ష్ష్..ష్ష్..ష్ష్ అంటూ కాకిని తరిమాడు. ఆ చెట్టుమీద తన గూడు ఉంది. ఆ గూటిలో తన పిల్లకాకి ఉంది. ఈ మానవ్ఞడు మాకు ఏదైనా అపకారం తలపెడ్తాడేమో అనే భయంతో ఆ కాకి అరవడం ప్రారంభిం చింది. దానితో ధ్యానం భంగమై పోయింది.
కరుణాకరుడు దిగులుపడ్డాడు. ఇది చాలా మంచి చోటు, అందునా ఎంతో ప్రశాంతంగా ఉండే చోటు, ధ్యానానికి అనువైన చోటు ఇది. ఇలాంటి చోటును వదులుకోవడం సరియైనవిషయం కాదు. కాని కాకి కావ్..కావ్..శబ్ధం ఆపేది ఎలా? కాకిని అరవ కుండా చెయ్యడం ఎలా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. అర్ధరాత్రి అయ్యింది. ఊరంతా నిద్రపోతుంది. కాకి అరుపులు ఆపడం ఎలా అనే విషయంమీద కరుణాకరుడు ఆలోచిస్తున్నాడు.
అర్ధరాత్రి దాటిన తర్వాత హఠాత్తుగా కరుణాకరుడికి మదిలో ఓ ఉపాయం తట్టింది. ఆ ఉపాయానికి తనను తాను అభినందించుకుంటూ హాయిగా నిద్రపోయాడు.ఆ ఆలోచనను ఆచరణలోపెట్టాలని తెల్లవారకముందే నిద్రలేచాడు. ఊరిబయటికెళ్ళాడు. ప్రశాంత వాతావరణంలో అరుగుమీదికి చేరుకొన్నాడు. ధ్యానంకోసం పద్మాసనం వేసుకోబోతుంటే కాకి మొదలు పెట్టింది కావ్..కావ్..అని. వెంటనే లేచి కరుణాకరుడు తాను తెచ్చిన అన్నం అక్కడే పడిఉన్న ఓ మట్టిపెంకుపై పెట్టి చెట్టెక్కి చెట్టుకొమ్మపై పెట్టాడు. క్రిందికి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చొన్నాడు. కాకి అన్నంను పసిగట్టింది. తన ముక్కుతో తినడం ప్రారంభిం చింది.
కొద్దికొద్దిగా తీసుకెళ్ళి తన పిల్లకాకికి పెట్టుకోసాగింది మౌనంగా. తన ఉపాయం చక్కగా పని చేసినందుకు సంతో షిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కరుణాకరుడు. ఆయన రోజూ అలా కాకికి అన్నం పెడుతూ ఎంతో తొందరగా ధ్యాన నిమ గ్నుడై బాహ్య దేహాన్ని మరచిపోయేవాడు. ఉపాయం ఉంటే అపాయాన్ని హాయిగా దాటుకోవచ్చు.