శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఈ కీర్తన..
ప|| భావయామి గోపాలబాలం మన- | స్సేవితం తత్పదం చింతయేయం సదా ||
చ|| కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా- | పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం | చటుల నటనా సముజ్జ్వల విలాసం ||
చ|| నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- | సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం | పరమ పురుషం గోపాలబాలం ||
భావం: ఈ సంకీర్తన అన్నమాచార్యుల భావనా సముద్రంలో ఉప్పాంగిన ఒక అల. సంస్కృతభాషలో బాలకృష్ణుని అందాన్ని, ఆయన పనులను భావయామి అని చెపున్నారు..
బాలకృష్ణుని పాదాలను నిరంతరం మనస్సులోనే భావిస్తున్నాను. ఆయన పదములను నిరంతరం ఆలోచిస్తున్నాను.
చెక్కబడిన నవరత్నాల రాళ్ళు పొదిగిన, చిన్ని చిన్ని గంటలు కూర్పుబడిన మొలత్రాడు ధరించి పాదాలను వంచుతూ నర్తిస్తూ, శరీరంపై ఉన్న భూషణములు కూడా శబ్దాలు చేస్తూండగా అటూ,
ఇటూ తిరుగుతూ ఇంటిపైకప్పు దద్దరిల్లేలా గలగల శబ్దం చేస్తూ అగ్ని సమానంగా ప్రకాశిస్తున్న బాలగోపాలుని మనస్సులో భావిస్తున్నాను.
నిరంతరం చేతియందు వెన్నెను పట్టుకున్న వానిని, బ్రహ్మ మొదలగు దేవతల నిరంతర భావనలలో సేవింపబడువానిని, ప్రకాశమానమైన పాదములు కలిగిన వానిని, వేంకటాచలముపై నివాసము ఏర్పరచుకున వాడైన హరిని, పరమపురుషుని,. పోల్చడానికి యే ఉపమానాలూ లేనివాడిని, గోవులను పాలించు బాలుని మనస్సుయందు నిరంతరం భావించుచున్నాను.