బాలకృష్ణ లీలలు.. ..
ఒకసారి అన్న బలరాముడు వచ్చి, యశోదతో తమ్ముడు మన్ను తింటున్నాడని ఫిర్యాదు చేశాడు
. కృష్ణుడి చేతులు పట్టుకొని ‘‘నిజం చెప్పు... మన్ను తిన్నావా?’’ అంటూ గద్దించింది యశోద.
కృష్ణుడు భయాన్ని నటిస్తూ, ‘‘వాళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారే! వెన్న పెట్టే తల్లివి నువ్వుండగా మన్ను తినే ఖర్మ నాకేల? వారికి నేనంటే కిట్టదు. కావాలంటే నేను చెప్పేది నమ్ము. వాళ్ళ మాటలు వినకు’’ అన్నాడు.
ఈ సందర్భంలో పోతన భాగవతంలో-...
‘అమ్మ మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో- నమ్మంజూడకు వీరి మాటలు మదిన్’ అన్నాడు.
అయితే నోరు విప్పి చూపించమన్నది యశోద.
బాలకృష్ణుడు తల్లి మాట విని నోరు తెరిచాడు.
యశోద దిగ్భాంతి చెందింది.
సమస్త విశ్వం ఆ నోటిలోనే గోచరించింది.
అప్రయత్నంగా యశోదకు కలిగిన ఆ అనుభవాన్ని పోతన ఎంతో అందంగా చెప్పాడు:
కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరక యున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో బాలకుండెంత ! యతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్
‘ఇతడు బాలుడిగా భాసిల్లుతున్నాడు గానీ సాక్షాత్తూ విశ్వాత్మజుడైన విష్ణువే’ననే నిర్ణయానికి ఆమె వచ్చింది.
ఈ సన్నివేశానికి ఊహాశక్తితో, భక్తిప్రపత్తితో మెరుగులుదిద్దినట్టు లీలాశుకుడు తన శ్రీ కృష్ణ కర్ణామృతం లో ఇలా అంటాడు..
బాలకృష్ణుని నోటిలో కైలాసపర్వతం చూసి వెన్న ముద్ద అనీ, క్షీర సాగరాన్ని చూసి తాను ప్రతిరోజూ ఇస్తున్న పాలేననీ ఆమె భ్రమించిందట.
ఎవరి దృష్టి పడిందో, నా బిడ్డకు అజీర్ణం చేసిందని ‘థూ! థూ!’ అని దిష్టి తీసిందట. ‘చిరంజీవ! చిరంజీవ!’ అంటూ రక్ష పెట్టిందట.
తల్లిగా యశోదది ఎంత స్వాభావికమైన కృత్యం!