(లంకాదహనం చేశాక సీతమ్మవారి క్షేమం గుఱించి ఆందోళన చెందిన ఆంజనేయులవారు తన మనసులో అనుకున్న మాటలు)
శ్లో|| ధన్యాస్తే పురుషశ్రేష్ఠా యే బుద్ధ్వా కోపముత్థితమ్ |
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా ||
తాత్పర్యం :- భగ్గున మండిన మంటను నీటితో ఆర్పినట్లు ఏ పురుషశ్రేష్ఠులు తమలో
కోపం రగిలిన వెంటనే అది తెలుసుకొని తమని తాము నిగ్రహించుకుంటారో అట్టివారు
మహాత్ములూ, ధన్యులూను.
శ్లో|| క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్ గురూనపి |
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూన్ అధిక్షిపేత్ || తాత్పర్యం :- కోపం వచ్చినవాడు చేయని పాపం ఏముంది ? కోపిష్ఠివాడు పెద్దల్ని సైతం
చంపుతాడు. అతడు పెలుచ మాటలతో మంచివారిని ఈసడిస్తాడు.
శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ |
నాఽకార్యమస్తి క్రుద్ధస్య నాఽవాచ్యం విద్యతే క్వచిత్ ||
తాత్పర్యం :- ఏం మాట్లాడొచ్చునో, ఏం మాట్లాడకూడదో కోపిష్ఠికి ఎప్పుడూ తెలియదు. ఇది చేయొచ్చు, ఇది కూడదు అన్న విచక్షణే అతనికుండదు.
శ్లో|| యస్సముత్థితం క్రోధం క్షమయైవ నిరస్యతి |
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే ||
తాత్పర్యం :- పాతబడ్డ కుబుసాన్ని పాము విడిచినట్లుగా ఎవడైతే కోపం దరికొన్న వెంటనే
దాన్ని ఓర్పు అనే సాధనంతో వెళ్ళగొడతాడో అతడే పురుష శబ్దవాచ్యుడు (మనిషి అనిపించుకోదగ్గవాడు).
🍁🍁🍁
శ్లో|| కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ || (గీత-కర్మయోగం)
తాత్పర్యం :- అర్జునా ! రజోగుణం నుంచి పుట్టిన ఈ కామమూ, క్రోధమూ నీ శత్రువులని తెలుసుకో. వీటికి ఎంత తిన్నా చాలని ఆకలి. ఇవి ఎంత పాపానికైనా ఒడిగట్టిస్తాయి.
🍁🍁🍁
శ్లో|| ఆప్తద్వేషాద్ భవేన్ మృత్యుః పరద్వేషాద్ ధనక్షయః |
రాజద్వేషాద్ భవేన్ నాశో బ్రహ్మద్వేషాత్ కులక్షయః || (సంస్కృత సూక్తి రత్నకోశః)
తాత్పర్యం :- ఆప్తుల్ని ద్వేషిస్తే చావు దగ్గఱపడుతుంది. ఇతరుల్ని ద్వేషిస్తే డబ్బు
ఖర్చవుతుంది. రాజును ద్వేషిస్తే సర్వనాశనం వాటిల్లుతుంది. బ్రాహ్మణుల్ని ద్వేషిస్తే వంశనాశనం జరుగుతుంది.
శ్లో|| అపకారిణి కోపశ్చేత్ కోపే కోపం కథం న జాయేత |
ధర్మార్థకామమోక్షప్రాణయశోహారిణి క్రూరే ||
(సంస్కృత సూక్తి రత్నకోశః)
తాత్పర్యం :- ఒకడు మనకు హాని చేస్తున్నాడనే కదా, అతని మీద మనం కోపం పెట్టుకునేది ? అటువంటప్పుడు కోపం మీదనే కోపం పెట్టుకోవాలి కదా ? ఎందుకంటే కోపం చేసేటంత హాని ఎవఱు చేయగలరు ? అది ధర్మాన్నీ, అర్థాన్నీ, కామాన్నీ, మోక్షాన్నీ, ప్రాణాన్నీ, మంచిపేరునీ అన్నింటికీ చెఱుపు చేస్తుంది.
🍁🍁🍁
శ్లో|| అరుష్యన్ క్రుశ్యమానస్య సుకృతం నామ విన్దతి |
దుష్కృతం చాఽఽత్మనోఽమర్షీ రుష్యత్యేవాఽపమార్ష్టి చ ||
(మహాభారతం)
తాత్పర్యం :- తన మీద కోపించేవాడి మీద ఎవడు కోపించడో వాడాకోపిష్ఠివాడి పుణ్యాన్ని తాను పొంది తన పాపాన్ని వాడికిస్తాడు. కనుక కోపించేవాడు అవతలివారిని పాపవిముక్తుల్ని చేస్తూ తాను మాత్రం అధోగతి పాలవుతున్నాడు.
🍁🍁🍁
శ్లో|| కామ: పత్నీ పతిః క్రోధస్తౌ బింబప్రతిబింబవత్ |
ఏకం జనం సమాహూయ ప్రాప్నుయా దపరం ధ్రువమ్ || (చాటువు)
తాత్పర్యం :- కామక్రోధాలు భార్యాభర్తల జంట వంటివి.అవి వస్తువూ, దాని నీడ వంటివి (బింబ ప్రతిబింబాలు). ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. వారిలో ఒకఱిని పిలిస్తే రెండోవారు పిలవక పోయినా వచ్చేస్తారు. ఇది తథ్యం.
శ్లో|| దినార్ధం నాశయేత్ స్వాస్థ్యం మాసార్ధం జీవనం హరేత్ |
జీవితార్ధం యశో హన్యాత్ కోపః పుణ్యం తు శాశ్వతమ్ ||
(చాటువు)
తాత్పర్యం :- కోపించినందువల్ల సగం రోజుకు సరిపడా ఆరోగ్యం నాశనమవుతుంది (అంటే కోపం ఆరోగ్యానికి చేసే హాని నుంచి కోలుకోవడానికి పన్నెండు గంటల సమయం పట్టుతుంది) సగం నెలకు సరిపడా ఆదాయం నాశనమవుతుంది. సగం జీవితకాలం పాటు కష్టపడి సంపాదించుకున్న మంచిపేరు పోతుంది. ఇక పుణ్యమో, శాశ్వతంగా పోతుంది.
శ్లో|| క్షుల్లం కరోష్యఖిలసూరిశిరోమణిం త్వం
గ్రామ్యం కరోషి ధరణీదయితాతిమాత్రమ్ |
దేవేషు నాఽఽదరమపైతి తవ ప్రభావాత్
హే క్రుత్ కియాన్ స్తవ భవేన్ మహిమాఽద్వితీయః || (చాటువు)
తాత్పర్యం :- ఆహా కోపమా ! నీది ఎంతటి గొప్పదనమే ? నువ్వు ఆవహించిన నిమిషంలో పరమనీచుణ్ణి కూడా సమస్త పండితులకీ శిరోమణిని చేస్తావు (వాడు అలా అనుకుంటాడు). పల్లెటూరి బైతుని సైతం సర్వంసహాధిపతియైన రాజు కంటే పైవాణ్ణి చేస్తావు (వాడు అలా అనుకుంటాడు). నీ ప్రభావం మూలాన మానవుడు ఆ క్షణంలో దేవతల్ని కూడా లెక్కచేయడు.