‘వాడికి ఎంత అహంకారమో చూడు!’ అంటుంటాం అప్పుడప్పుడూ. అలాగే.. ‘వాడికి తన తప్పు ఒప్పు కోవటానికి అహం అడ్డొచ్చింది’ అని కూడా అంటుంటాం. అహంకారం అంటే పొగరు అని, అహం అంటే మితిమీరిన ఆత్మాభిమానం అని తెలుగులో అందరూ చెప్పుకొనే అర్థాలు. అయితే సంస్కృత భాషనుండి తెలుగులోకి వచ్చిన ఈ పదానికి సంస్కృతంలో ఉన్న అర్థం కొంత వేరుగా కనబడుతుంది. సంస్కృతంలో ‘అహం’ అంటే.. ‘నేను’ అని అర్థం. అహంకారం అంటే నేను అనే భావన. ఇది లేని జీవి ఎవరు?
మనుషులలోనే కాదు, పశుపక్ష్యాదులలో, క్రిమికీటకాదులలోనూ ఈ అనే భావన కనబడుతుంది. అయితే వ్యక్తపరిచే విధానం వేరు. మనుషులలో అయితే తమలో ఉన్న ‘నేను’ను ఇతరులకు తెలియజెప్పడానికి ఇతర ప్రాణులకూలేని సాధనం భాష ఉంది. ఈ ‘నేను’ను అనేకమంది అనేక విధాలుగా ఇతరులకు తెలియజేస్తుంటారు. లేచింది మొదలు నిద్రపోయే వరకూ.. ‘నేను, నేను’ అంటూ కాలం గడిపేవారే చాలా మంది. తమలో ఉన్న ‘నేను’ను ఎన్నో ఏళ్ల క్రితమే మర్చిపోయి కేవలం ఒక యంత్రంలా జీవించేవారూ కొందరు కనబడుతారు. కొందరు ‘నేను’గానే ఉండటానికి ఇష్టపడతారు. సమాజం నుండి తమను ఎప్పుడూ వేరుచేసుకుని తమ ఉనికిని చాటుకుంటారు. ఇలాంటివారు తమ కోసం సమాజాన్నంతటినీ పణంగా పెట్టవచ్చు. అటువంటి ‘నేను’ ప్రమాదకరమైనది. అందరినీ కబళిస్తూ పెరిగే అలాంటి ‘నేను’ను కబళించే మరొక పెద్ద ‘నేను’ రావచ్చు. అప్పుడు? మనుగడే కష్టమౌతుంది. అలాగే సమాజంలో కలవకుండా తమలో శక్తి ఉన్నంతకాలం.. ‘నా బ్రతుకు నాదే. నన్నేమైనా సమాజం పోషిస్తోందా? నేను ఎవరికీ భయపడను. నా ప్రవర్తనకు ఎవరికీ సంజాయిషీ కూడా ఇవ్వను’ అంటూ బ్రతికే వారూ ఉన్నారు. ఇదీ ఆరోగ్యకరమైనది కాదు. కొందరు తమతో మరికొందరిని కలుపుకొని ‘మేము’గా చెబుతారు. అలా వారు మిగిలిన సమాజాన్నంతటినీ శాసించాలని చూస్తారు. వారిలో ఉన్న ఐక్యత సడలనంతవరకూ వారు సమాజానికి మంచినీ చేయగలుగుతారు.
‘నేను’లో ఉన్న ఈ వైవిధ్యాలన్నీ ఒక ఎత్తు. తనలోని ‘నేను’ను మర్చిపోయి అందరినీ కలుపుకొంటూ ‘ఆత్మవత్ సర్వభూతేషు’ అనే భావనతో ‘మనం’ అనే సమైక్య మంత్రాన్ని జీవనతారకంగా నమ్మి జీవించేవారూ ఉన్నారు. వారు ధర్మప్రియులు. ధరణీధరులు. ఈ అహం మనుషుల్లోనే కాదు. దేవునికీ ఉంది. ‘అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా’ అన్న గీతాచార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ తన ప్రకృతి ఎనిమిది విధాలు (పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం) అన్నాడు. ఆయనే ‘అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ’ అని, ‘తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్’ అని తనను నమ్ముకున్న వారిని అన్ని పాపములనుండి రక్షిస్తానని, వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూస్తాను అని చెప్పాడు. కనుక అణువు మొదలు అనంతుని వరకూ అందరిలో ఉన్నది అహం. ఈ అహం లో ఉన్న తారతమ్యాలూ అసంఖ్యాకంగా ఉన్నాయి. దీన్ని విడిచి ఎవ్వరూ ఉండలేరు అన్నది స్పష్టం. కనుక లోకాపకారకమైన అహాన్ని విడిచి పెట్టి లోకాలన్నింటినీ ఏకాత్మతా వాదం వైపు నడిపించే అహాన్ని ఉపాసించటమే వివేకం.