ఈలపాట రఘురామయ్య గా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య 
(మార్చి 5, 1901 - ఫిబ్రవరి 24, 1975) 
సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు, ఇరవైరెండు చలనచిత్రాలలో తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. తెలుగు నాటకాలకుమాత్రమే ప్రత్యేకము అయిన పద్య ఉటంకము. అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము మరియు సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేస్తారని ప్రతీతి.
రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది. అనుపూర్విక నటనలో (Method acting) ఈయన ప్రసిద్ధుడు. కళారంగానికి చేసిన అత్యున్నత కృషికిగాను 1973లో సంగీత నాటక అకాడెమి వారి పురస్కారము, 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము ఈయనను వరించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకు "నాటక కూయిల" అని ప్రశంసించారు.
జననం
రఘురామయ్య గుంటూరు జిల్లా సుద్దపల్లి లో 1901, మార్చి 5 వ తేదీన కళ్యాణం నరసింహరావు, కళ్యాణం వేంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండే నాటకాలు వేసాడు. రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతి పొందాడు. అందువలన కాశీనాథుని నాగేశ్వరరావు రఘురామయ్య అని పేరు పెట్టారు.
వృత్తి జీవనం
దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన స్త్రీ, పురుష పాత్రలు ధరించారు. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కాని ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, ఈలపాట తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవారు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5వ సచలనచిత్రం మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే "పృథ్వీ పుత్ర". రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు 100 చలన చిత్రాలలో నటించారు.
1972లో నాటక బృందంతో కౌలాలంపూర్, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ లలో పర్యటించాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను "ఆంధ్ర నైటింగేల్" అని ప్రశంసించారు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.
వ్యక్తిగత జీవనం
రోహిణి వేంకట సుబ్బయ్య, సీతమ్మ దంపతుల రెండవ కుమార్తెయైన సావిత్రి గారితో ఈయన వివాహం 1938లో బాపట్లలో జరిగినది. 92యేళ్ళ వయస్సులో, డిసెంబరు 8 2014లో విజయవాడలో ఆవిడ స్వర్గస్థులైనారు. వారి సంతానం ఏకైక కుమార్తె; పేరు సత్యవతి. సత్యవతిగారి వివాహం తోట పార్వతీశ్వరరావు గారితో జరిగినది. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2014 న తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, మరియు వారి సతీమణి ఆవిష్కరించారు.
మరణం
ఈయన తన 75వ ఏట 1975, ఫిబ్రవరి 24 న గుండెపోటుతో మరణించాడు.