(మార్చి 6, 1899 - ఆగష్టు 30, 1949)
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి.
బాల్యం, వివాహం
ఈమె 1899, మార్చి 6 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు 9వ ఏట తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహం జరిగింది. పండితులైన తండ్రిగారి వద్దనే ఉండి ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి పరీక్షలు చదివారు. 16 సంవత్సరాల వయసులో భర్త దగ్గరకు కాకినాడ వచ్చారు. ఆకాలంలో నరసింహశర్మ పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సూపరింటెండెంటుగా ఉన్నారు.
కాంగ్రెస్ ఉద్యమంలోకి
1921లో దంపతులిద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై విజయవాడలో జరిగిన కాంగ్రెసు సమావేశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత, శాసనోల్లంఘన, విదేశీ వస్త్ర దహనాలు, వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాదు కాంగ్రెసుకు వెళ్లి అక్కడ సబర్మతీ ఆశ్రమానికి వెల్లి, గాంధీజీని దర్శించుకున్నారు. తిరిగివచ్చిన పిమ్మట వారిరువురూ స్థిరపడి ఒకచోట కార్యక్రమాలు నిర్వహించాలనుకొని రాజమండ్రి గోదావరి తీరాన "ఆనంద నికేతనాశ్రమం" 1923లో స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ జనాభ్యుదయం, నూలు వడకడం, ఖాదీ నేయడం, అనాథలను ఆదరించడం వంటి కార్యకలాపాలు ఈ ఆశ్రమం ద్వారా సాథించారు.
ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా
1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చురుకుగా పాల్గొని, శాసనధిక్కారం చేసి, బహిరంగంగా విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగులు చేసి 1930లో జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1932లో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం సమయంలో ప్రభుత్వం దమననీతిని అవలంబించింది. సభలు, సమావేశాలను నిషేధించింది. ఆజ్ఞల్ని ఉల్లంఘించి తెనాలిలో మండల కాంగ్రెసు సభను జరిపారు. మరో 6 నెలలు జైలుశిక్షను రాయవెల్లురులో అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ప్రభుత్వం ఆనంద నికేతనాశ్రమాన్ని స్వాధీనపరుచుకున్నది.
రచన రంగం
1920 - 1949 మధ్యకాలంలో ఈమె రాసిన 125 పద్యాలను ఆమె మరణానంతరం 1973లో ఆమె సోదరులు "కవితా కదంబం" అనే పేరిట ఒక సంపుటిగా ప్రచురించారు. ఈమె అభ్యుదయ దృక్పథం ఉన్న కవయిత్రి. ఆమె మంచి వక్తగా పేరుపొందారు. "వైతాళికులు" సంకలనంలో ఈమె కవితలు చోటుచేసుకున్నాయి.
మరణం
ఈమె 1949, ఆగష్టు 30 తేదీన స్వర్గస్తులయ్యారు.
-----------------------------------------------------------
మనకు తెలియని ఎందరో స్వాతంత్ర నాయకురాళ్లు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం...
శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు భీమవరం సమీపంలోని ఉండి గ్రామంలో మల్లవరపు సీతమ్మ, శ్రీరాములు గార్ల ప్రధమ సంతానంగా జన్మిం చారు. ఉంగుటూరుకు చెందిన తల్లాప్రగడ నరసింహశర్మ గారితో 9వ ఏటనే ఈమెకు వివాహం జరిగింది. పెద్దతమ్ముడు శ్రీ వేంకట కృష్ణారావు స్వాతంత్ర సమరవీరులు, మాజీ మద్రాసు విద్యామంత్రి. చిన్న తమ్ముడు శ్రీ విశ్వేశ్వర రావు స్వాతంత్ర్య సమర వీరులు, కవి.1923 లో ఆర్యాపురంలో " ఆనందనికేతనాశ్రయం" భర్తతో కలిసి నిర్వ హించారు.అప్పృశ్యతా నివారణ, స్త్రీజనాభ్యుదయం,నూలు వడకటం వంటి నిర్మాణా త్మకమైన కార్యకలాపాలకు అది సాధనమైంది. తర్వాత చాగల్లులో ఆశ్రమాన్ని నిర్వహిం చారు. ఆమె పాల్గొనని భహిరంగసభ లేదు. విదేశీ వస్త్ర దహనాలకు అంతులేదు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనోద్యయం లోను పాల్గొని, వెల్లూరు జైలులో కఠిన శిక్షననుభవించారు. 125గీతాలతో “ కవితా కదంబం " ప్రచురించారు. తన శక్తిని, సమయాన్ని సంఘసంస్కారానికి, దేశ సేవకు వినియోగించినట్టుగానే, ఆమె తన కవన శక్తిని సంఘంకోసం వెచ్చించారు. “ వనితలందర నగచాట్ల పాల్గొనర ఆంగ్ల జాతికి గౌరవ మంతరించే చాలునిక ఆంగ్లేయుల పాలనమ్ము-చోటు లేదిక వారికి చోట సుంత “ అని తేల్చిచెప్పేశారు. కొంతకాలం వీరేశలింగం పంతులు గారి వితంతు శరణాలయం నడపటంలో సహకరించారు.
----------------------------------------------------------
ఆనాడు భారత స్వాతంత్య్ర సమర శంఖారావం దేశమంతటా మారుమోగింది. పురుషులతో సమానంగా స్త్రీలూ ఉద్యమంలోకి దూకారు. పోరాటపటిమను చాటారు. అయినా విస్మృత చరితలుగానే మిగిలిపోయారు. స్వాతంత్య్రోద్యమంతో పాటు ఏకకాలంలో తెలుగునాట సంస్కరణోద్యమం వెల్లువెత్తింది. ఆ ప్రభావంతో ఉత్తేజితురాలై తన జీవితాన్ని స్త్రీ జనోద్ధరణకు అంకితం చేసిన కవయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ. విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి అనేకసార్లు చెరసాల కష్టాలనూ ఎదుర్కొన్నారామె.
      విశ్వసుందరమ్మ మార్చి 6, 1899న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ. భర్త తల్లాప్రగడ నరసింహశర్మ. పాఠశాల చదువు లేకపోయినా, విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి నిర్వహించిన ‘ఉభయభాషాప్రవీణ, సాహిత్య శిరోమణి’ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. దంపతులిద్దరూ కలిసి 1923లో రాజమహేంద్రవరంలో ‘ఆనందనికేతనం’ ఆశ్రమాన్ని స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ జనాభ్యుదయం, నూలు వడకటం, ఖద్దరుదుస్తులు నేయటం తదితర కార్యక్రమాలను చేపట్టారు. విదేశీ వస్త్రదహన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1930 మేలో వీళ్లను అరెస్టు చేశారు. దాదాపు ఆర్నెల్ల పాటు ఖైదు చేశారు. జులై 6, 1932న తెనాలి మండల కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించిన విశ్వసుందరమ్మను మరో 26 మందితో కలిపి మళ్లీ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆర్నెల్ల కారాగార శిక్ష వేసి, రాయవెల్లూరు జైలుకు పంపారు. 1942 క్విట్ఇండియా ఉద్యమ సమయంలో వీరి ఆశ్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
      ఇన్ని ఒడుదొడుకులు, అలజడుల మధ్య కూడా జాతిని జాగృతం చేస్తూ అసంఖ్యాక కవితలను రచించారు విశ్వసుందరమ్మ. వివిధ కోణాల నుంచి మద్యపాన సమస్యను పరిశీలించిన ఆవిడ... ‘‘కల్లు స్వదేశియే, కనుక ద్రావగవచ్చు ననెడి దుర్వాదమున్ వినకుమయ్య’’ అని హెచ్చరించారు. విశ్వసుందరమ్మ కవితల్లో అధికభాగం స్వాతంత్య్రోద్యమాన్ని ప్రబోధించేవే. ‘‘కొంపతీయు వర్తకుడై కొట్టినాడు దేశమంత, మాటలాడితె శిక్షలంట, పాటపాడితే కేసులంట’’ అని ఆంగ్లేయులను నిందించారు. ‘‘భారతీయుల మగుచు ప్రభవించి ఫలమేమి నిజదేశ స్వాతంత్య్రమును గాంచక?’’ అని ప్రశ్నించారు. 
      ఆనాటి స్త్రీల పరిస్థితుల గురించి, విశ్వసుందరమ్మ మాదిరిగా వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు రాసినవారు అరుదు. ‘‘బహువస్త్రములు కల్గు భామలే యచ్చట జతవస్త్రముల తోడ జరుపవలసె- నేతివెన్నలతోడ నేస్తమాడెడి వారె తైలహీనాన్నమును దినగవలసె..’’ అంటూ మహిళాలోకపు కడగండ్లకు అక్షరరూపమిచ్చారావిడ. ‘‘కాన్విక్టు వార్డరు క్రమముగా ప్రతిరోజు అధికార్లయాజ్ఞల నందజేయ- నల్లచీరల గట్టినట్టి జైల్వార్డరు అడుగడుగున మమ్ము హడలజేయ- లక్ష్యమింతయు జేయక, లక్ష్యమెరిగి, అల యశోకవనాన సీతమ్మలనగ, గడుపుచున్నారు నెలతలు ఖైదు బ్రతుకు- రాయవెల్లూరు జైలు నిర్బంధమందు’’ అని ఆవేదన చెందారు. 
      స్త్రీ జనాభ్యుదయం కోసం అహరహం శ్రమించిన విశ్వసుందరమ్మ ఆగస్టు 30, 1949న కీర్తిశేషులయ్యారు. ఆవిడ రాసిన ‘జైలు గడియారం’ కవిత అనువాదాన్ని సూసీతారు, కె.లలిత సంకలనం చేసిన ‘విమెన్రైటింగ్ ఇన్ ఇండియా, వాల్యూమ్-2’లో చూడవచ్చు. అమోఘమైన వర్ణనాపటిమ, పరిశీలనాశక్తితో సరళభాషలో కవిత్వం రాయడమే కాదు, అభ్యుదయ సమాజ నిర్మాణానికి ఉద్యమాల్ని పునాదిగా చేసుకున్న ధీరవనిత విశ్వసుందరమ్మ. స్త్రీ శక్తికి ప్రతిరూపమైన ఆమె ఎప్పటికీ స్ఫూర్తిదాతే.