ఏంటి! బావా!! అలా కోపంగా, గుర్రుగా చూస్తూన్నావు?
నే ఏం తప్పు చేయలేదు బావా!ఎక్కడకు నే వెళ్ళలేదు మావో!!
నీ రాక కోసం ఎదురు చూసి చూసి రాకపోయే సరికి నే చేసేది ఏమి లేక నిన్నే వెతుకుతూ వెతుకుతూ
నీవు అలసిసొలసి ఆకలితో వస్తే మెతుకులు కావాలని అటు పోయా!
నే నిన్ను ఒక క్షణమైన చూడక ఉండబట్టలేక వెళ్ళి వచ్చా!
అంతదానికే అలిగి ఇంతకోపంగా దూరం ఉంటే ఎలా చెప్పు?
అంతేనా నన్ను అర్థం చేసుకుంది?
అపార్థం చాలా ప్రమాదం అని తెలియదా బావా?
అది కొంపలు కొల్లేరుగా మార్చి, మన మధురమైన సంసారాన్ని నిలువునా కూల్చదా?చెప్పు!
నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే నిన్ను దూరం చేయదా?
నీ ఎడబాటు నా ఎద పోటుగా మారదా! చెప్పు?
అయిన దానికి, కాని దానికి పెడార్ధలు చేస్తే పచ్చని కాపురం అగ్గిపాలు కాదా?
నిజం చెప్పు! బావా!! అసలు నా పై అంత కోపపు రుసరుసలు ఎందుకు?
నే చేసిన నేరం ఏమిటి?
జరిగిపోయిన ఘోరం ఏమిటి?
నిజమే నిన్ను అడగక అలా పోవడం తప్పె అది నీ కోసమే కదా?
నమ్మకమే ప్రేమకు నాంది అదే బలమైన కాపురానికి పునాది బావా!
నీ మౌనం నన్ను కూల్చిన భవనంలా; ఎడారిలో సునామీ లా ఉంది !
నీ పాదం మీద నా పాదంతో ఒట్టు వేసి చెప్పుతున్నా బావా! నన్ను నమ్మమని!!
ఇంత కంటే ఇంకేమైనా చేయమంటే అది చేస్తా బావా !
నీవే నా సర్వస్వం అయినప్పుడు నే ఏమైనా పర్వాలేదు! అసలు విషయం చెప్పు మామా!!
మనసులో ఏమి దాచకు అది నిన్ను, నన్ను దహించి వేస్తుంది పెనిమిటి!
అహల్య లా రాయిగా చేస్తావా? చేయి,లేక సీతలా అగ్ని లో చేరమంటవా హాయిగా చేస్తాను!
నే ఏనాడూ నీ మాట కాదనలేదు నీ అడుగు జాడలు నే వదలలేదు!!
నీకు ఏది సబబో అది నాకు అదే సబబు చెప్పు మామ నవాబు లా అలా బిగదీసుకుంటే ఎలా? ప్రియమైన సఖుడా!!