08.09.2022
సోమవారం..
( తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా )
1. తేటగీతి..
నింగి , నేలకు సమమగు నీదుభాష
సతము వీడక బలుకుము జక్కగాను
మనసువిప్పుట సులభమౌ మాటదెలియ
మాతృభాషను గాపాడు! మరువవద్దు !!
.......................................................
2. తేటగీతి.... ( బృంద పెద్దల నుద్దేశించి )
తెలుగు తేనియల్ గ్రోలుచు వెలుగునింప
గట్టిబాటలు బరచిన ఘనులు మీరు
బృందసభ్యులు సహకార బంధనమున
తెలుగు జిలుగులు కవిగొని తేజరిల్లె...
.......................................................
కవిగొను ...... వ్యాపించు, విస్తరించు
...........
3. ఆటవెలది ( తెలుగు భాషా మాధుర్యం )
తెలుగు తేనెజల్లు తెల్లార్లు కురవంగ
తెలుగు ప్రాభవంబు దిరుగులేక
భాషచరిత నిటుల భాసిల్లుచున్నట్టి
తేనెపట్టులాంటి తెలుగులెస్స.....
...............................................
గిడుగు వారికి నమస్సులు
4. తేటగీతి మాలిక..
గిడుగువారికి సరితూగు పిడుగులేడు
పల్లెపట్టుల భాషను పదిలబరచి
తెలుగు సాహిత్య వైభవ దిశనుమార్చి
సంస్కరణముల బాటను చాటిజెప్పి
గట్టిమేలును దలబెట్టి ఘనతనొంది
ప్రజల హృదయాల నిలచిన ప్రాజ్ఞుడితడు..
..................................................
5. తేటగీతి..
జాతి వైరము విడనాడ జగతియందు
సాటి మనిషిని ప్రేమించి సంఘమందు
ప్రేమభావము బంచిన ప్రేమమూర్తి
వారికర్పింతు భక్తితో వందనములు..
......................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు