పూర్వం కమలాపురం లో ఉన్న గ్రామస్తులందరూ చాలా కలివిడిగా ఉండేవారు. వారందరూ ఆఊరిలోనున్న కాకులన్నిటికీ ,పిలిచి భోజనం పెడుతే ఉండేవారు. ఏ ఇంటివారు అలవాటుగా చేసుకుంటే ఆఇంటికే ఆ కాకి వెళ్ళేది. ఒకరోజు కాంతమ్మ ఇంట్లో కాకి అన్నం తింటూ ముసిముసి నవ్వులు నవ్వింది. దాంతో కాంతమ్మ ఎందుకు అలా నవ్వుతున్నావని కాకిని ప్రశ్నించినది. అప్పట్లో కాకులు కూడ మాట్లాడేవి.
దానికి కాకి నిన్న ప్రక్కింటి తాయారమ్మ కోడలుని రెండు మొట్టికాయలు మొట్టినది, గుర్తుకు వచ్చి నవ్వుతున్నానని చెప్పింది. వెంటనే కాంతమ్మ కాకికి దగ్గరగా జరిగి,మరికాస్త పప్పు,నెయ్యి వడ్డించి,అప్పుడు ఏమైంది? కోడలు ఏడ్చిందా?అని కుతూహులంగా ప్రశ్నించింది. ఇలా ప్రతీరోజు కాంతమ్మ ఈ రోజు ఊళ్ళో విషయాలు ఏమిటని కాకిని అడిగి ,మరికాస్త రుచికరంగా భోజనం పెడుతూ ఉండేది. కాంతమ్మ ఇంట్లో కాకి ఊళ్ళోని మిగతా కాకులన్నిటికీ, అందరి ఇంట్లోని విషయాలు చెప్తుంటే, నాకు మంచి భోజనం పెడుతున్నారని చెప్పింది. మిగతా కాకులన్నీ ఆ మరునాడు నుండి ఓ ఇంటి సంగతులు మరొక ఇంట్లో చిలవలు , పలవలు అద్ది చెప్పుతూ,విందు భోజనం ఆరగించేవారు. నెమ్మదిగా ఆ ఊరిలో అందరూ చిన్న చిన్న గొడవలతో మొదలయి ,పెద్ద దెబ్బలాట్లవరకూ వెడుతూ ఉండేవారు. కొంతమంది పెద్దలు ఈ ఊరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేమిటని ఆలోచించి, ఆఖరుకు కాకులవల్ల అని నిర్ధారణకు వచ్చారు. ఆ ఊరికి ఒక నిఖార్సు అయిన స్వామీజీ వస్తే ,తమ సమస్యను చెప్పుకున్నారు. ఆ మరునాడు స్వామీజీ కాంతమ్మ ఇంట్లో ఒక భరిణె లాంటి వస్తువును ఒక గూట్లో పెట్టి, అది ఎవరు తెరుస్తారో వాళ్ళు అందంగా అవుతారని,తను స్నానం చేసి వచ్చి దాన్ని తెరుస్తానని అంతవరకూ, దాన్ని తెరవ వద్దని, కాకి వింటుంతుండగా ప్రక్కనుండి కాంతమ్మకు చెప్పారు. కాకి ఆ మాటలువిని చుట్టూ ఎవరూ లేరనుకుని నిర్ధారించుకుని,ఆశగా అందంగా అవుదామని భరిణె మూత తీసింది. తియ్యగానే ‘డాం ‘ అని చప్పుడు అయి నల్లటి పొగలు కమ్మేసి,ఒక్కమాటున తెల్లగా ఉన్న కాకి నల్లగా అయిపోయి,.గొంతుపోయి కావ్ కావ్ అని అరుచుకుంటూ బయటకు ఎగిరిపోయింది. అప్పుడు ఆ ఊరివారందరూ కాకులతో, మీ చెప్పుడు మాటలవల్ల మేము ఇన్ని గొడవలు పడ్డాము. ఇకనుండి మేము తినగా కంచాల్లో మిగిల్చే ఎంగిలి మెతుకులు తప్ప,మీకుపిలిచి ఎప్పుడూ తిండి పెట్టమనిచెప్పి,కాకులను తరిమేశారు.
నీతి — ఎవరయినాసరే ఇక్కడి మాటలు అక్కడ , అక్కడి మాటలు ఇక్కడ చెప్పకూడదని . చెప్పుడుమాటలు చెప్పకురా.. చెడేవు