✳ఒక జీవి సగటు ఎత్తు, జీవితాయుర్దాయం, ఆహార సేకరణ, సంతానోత్పత్తి, శ్వాస ప్రక్రియ వంటి ఎన్నో జీవన కార్యకలాపాలు, లక్షణాలు ఆయా జీవుల్లో ఉండే జన్యు స్మృతి (genetic code) ని బట్టి నిర్ధారితమవుతుంది. సాధారణంగా పెరుగుదలలోనూ, జీవి భౌతిక చర్యల వేగంలోనూ హడావిడిలేని జీవుల ఆయుర్దాయం ఎక్కువ. 'నిదానమే ప్రధానం' అన్న సామెతను తాబేలు నడకకే కాకుండా తాబేలు జీవన కార్యకలాపాలకు కూడా అన్వయించుకుకోవచ్చు. తాబేలు కార్యకలాపాలు మందకొడిగా ఉంటాయి. తద్వారా కణాలకు అలసట, క్షయం అనేవి తక్కువ. తాబేలు ఎంత మందకొడి అంటే దాని తలను పూర్తిగా తీసేసినా అది సుమారు నెలరోజులు బతుకగలదు. పైకి వచ్చి ఒకసారి గాలిపీల్చుకుంటే నీటి అడుగున కొన్ని గంటలపాటు ఉండగలదు. తాబేలు డిప్పమీద ఉన్న పెంకుల్లోని వలయాలనుబట్టి దాని రమారమి వయసును అంచనా వేయగలము. శరీరం కింద, పైన గట్టి పెంకుల్లాంటి డిప్పలు ఉండడం, ప్రమాదం సంభవించే క్షణాల్లో శరీరాన్ని మొత్తంగా లోపలికి ముడుచుకోవడం, నెమ్మదైన జీవితం, సాధారణంగా శాకాహార జీవనం తాబేళ్ల అధిక ఆయుర్దాయానికి కారణాలు. ప్రాథమిక కారణం జన్యు స్మృతిదే. తాబేళ్లే కాకుండా కోయి అనే చేపలు కూడా వంద సంవత్సరాలకుపైగా బతకగలుగుతున్నాయి.