##############
###########
నన్ను నీవు నిన్ను నేను వీడని నీడలా;
పక్షులు పలకరించే పిలుపులా; విహరించే ప్రేమపక్షులా బంధం ఒకటై అనుబంధ అనురాగ సాగరంలో తేలియాడుతూ;
ఎన్నో ఎన్నో బాసలు ఊసలు లాడుకుంటూ; !
ఊహాలోకంలో విహరిస్తూ చెట్టు,పుట్టల్లో పొలం గట్టుల్లో;రాళ్ళు రప్పల్లో; కొండకోనల్లో !!
ఇరువురు రెప్పలు ఒకటై;మన మనసంతా ఒకటై; నువ్వు నేను జత అయి;
అచ్చటముచ్చట్లు ఆడుకుంటూ; హాయిగా, ఆనందంగా ఆహ్లాదకరంగా అచ్చికబుచ్చికలాడుతూ;
ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ; భవిష్యత్తు కోసం ప్రణాళికల కసరత్తు సిద్ధం చేసుకుంటూ !
ఒకరిపై ఒకరం వీడలేని ప్రేమను కలిగి, నీ వారితో నీవు నా వారితో నేను
మనవారితో మనం యిద్దరం ఒకటై, ఎదురీత గా ఎదిరించి ఒప్పించి,
కళ్యాణ ఘడియలు దగ్గర అయ్యాకా; పెండ్లి కూతురు గా ముస్తాబు అయ్యాకా!
తీరా కళ్యాణ మండపం చేరి చేరకమునుపే;
గిట్టనివారి మాట విని నాపై మోయలేని,వేయకూడని అభాండాలు వేసి;
నాపై వేయరాని ముద్రవేసి ముఖం చాటేసి ;
నన్ను ఒంటరిగా వదలేసి
నీ దారి నా నీవు వెళ్ళిపోతే!!
నీ నీడలో తోడుగా కడదాకా పయనించాలని;
ఎన్నో ఆశల అలలతో ఉంటిని
ఇప్పుడా నా కంటికి నిద్రలేక చేస్తివి ; నా శరీరపు నాడులు బద్దలు కొట్టి నాకడుపు కోతకు గురిచేసి;
నా ప్రేమ ప్రేగును తెంచితివి !
నే ఇష్టం లేదు అంటే కష్టంగా నైన మరువడానికి వీలుపడేది;
నీ రూపం నచ్చలేదు అంటే పోనిలేనని సర్దుకొనిపోయేదాని;
అలా కాక నా పై వేయరాని భరించలేని మచ్చవేసి మసకబారి పారిపోతివి!!
అందరి ముందు నన్ను కులతను చేసి; నా మనసున కలతను రగ్గిచేసిపోతివి, నా సక్కనోడా!
నే నీ తోనే తప్పు చేయని దానిని మరొకరితో ఎలా చేయగలను చెప్పు;
ప్రేమకు నమ్మకం ఉండాలి, నమ్మకమే ప్రేమై ఉండాలి!!
అది లేకనే నాపై పరనిందలు వేసి పలాయనం చేసి;
ఇదేనా నీ ప్రేమ , నాపై నీ మాటలతో నా హృదయం లో మంటలు లేపి తాపీగా వెళ్లిపోతే!
నా గుండె ల్లో అగ్ని జ్వాలను సృష్టించి నా మనసుని అగ్గిగుండాన వేసి
నా జీవితాన్ని సుడిగుండానవేసి; సుడిగాలిలా ఎగిరి పోతివి, ఓ నా చెలి కాడా!!
సత్యశీలపరీక్షకు ఇది త్రేతాయుగంకాకపోయే;
అగ్గిగుండాన దూకి రగిలే గుండె మంటలను ఆర్పాడానికి;
కలికాలం ఒంటి కుంటి కాలం అయ్యే ఓ సఖుడా !
నీవు చేసి వెళ్ళిన పనికి నా కంటి కన్నీరు ఇంకి ఇంకి;
నా నరాల్లో దాగిన రక్తం రక్తకన్నీరు గా మారి ధారగా జారి జారి;
నాకన్నులు నీ రాకకోరకే వెదికి వెదికి; నా కంటిపాపలు మూత పడే నే నచ్చినోడా!!
ఇప్పటికైనా నిజం ఎరిగి;
నీవు నన్ను చేరి నా కంటి చివరి రక్తకన్నీటి బొట్టు తో;
నా నుదుట నీ చే రక్తతిలకం దిద్దుకోవాలని నా చిట్టచివరి కోరిక,సుమంగళిగా వెళ్ళాలని నా ఆశ, ఓ నా ప్రేమనాధ !
నేను ఏ తప్పు చేయలేదు ఇప్పటికైనా నన్ను నమ్ము ఓ నా హృదయ నాధా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.