ఒంపు సొంపుల వయ్యారి భామ నీ అందచందాల వదనం చూసిమైమరచి మురిసిపోయా సుందరి;
మీనపు కన్నులు గాంచి చక్కర్లు తిరిగి నీధ్యాసలో పడిపోయా ఓ నా చక్కనమ్మా మీనాక్షి!
సూటైన నిటారైన ఆ నాసిక గాంచి నిలువ లేకపోయానే ఓ నా రూపసి;
కైపు ఎక్కించే మిలమిలలాడే బుగ్గలు చూసి ఆగలేకపోయా ఓ నా చంద్రముఖి!!
ముచ్చటైన మందారపు వర్ణ జంట పెదాలు చూసి మత్తులో ఉండిపోయా ఓ నా చిరుమందహాసిని;
మెలికలు తిరిగే నీ మెడను చూసి నా మదిలో అలజడి అయ్యే ఓ నా దొరసాని!
నీ ఎదపొంగుల పరువాలు చూసి నా ఎద నిలువునా జారిపోయే ఓ నా హృదయ సఖీ!!
గిరగిరా తిరిగే సన్నని నడుము చక్కదనాలు చూసి నాకు ఆకాశపు చుక్క కనిపించే ఓ నా అందాల సితార;
నీ వాలుజడ కుచ్చులు నా మోము పై నర్తించగా నా మనంబు పులకరించే ఓ నా మోహిని!
నీ నెమలి నాట్యపు నడక చూసి నా నడక ఆగి నా అడుగులు నీ వెంట నడిచాయి ఓ నా నాట్య మయూరి!!
నీ అంగాంగాలు నా అంతరంగ మందిరంలో ఉయ్యాల జంపాల ఆడగా ఇక నే నిలువలేక ,నా మనసు విప్పి చెప్పగా నీవు తల ఊపి నాకు ఊపిరి అయితివే ఓ నా ప్రేమసఖీ!
నే నీకు మూడు ముళ్లు వేసి, నాతో కలిసి అగ్ని సాక్షిగా సప్త అడుగులు నడిపించానే ఓ నా కోమలాంగి!
కని కనిపించని అరుంధతీ చుక్కను చూపానే ఓ నా లతాంగి,
నాతో జతకలిసి పత్ని అయితివే ఓ నా భాగ్యమతి! ఓ నా శ్రీమతి!!
అది ఏ మాయో ఏమో !!! ఆ మరుసటి క్షణం నుంచే నా బతుకు కంచె వేసావే ఓ నా జవ్వని!
నే నీకు వేసింది మూడు ముళ్ళే ,నే వేసిన చేతులకు నీవు రెండేరెండు ముళ్లు వేసి;
నన్ను బంట్రోతు చేసావే ఓ నా కందిరీగ వంపుల వయ్యారి!!
నే నడిపించింది ఏడే అడుగులు అయిన నీ వెంట వేల వేల అడుగులు పెట్టిస్తూన్నావే! ఓ నా తేనెటీగ ధ్వనుల ధని!
నే కనికనిపించని చుక్కను చూపిస్తే నీవు రేయి అనక పగల అనక నక్షత్రమండలమే చూపిస్తూన్నావే! ఓ నా చందనాల చుక్కా ... !!
నిన్ను కోరి వెంట పడ్డప్పుడు అదో తియ్యదనపు అనుభూతుల యవ్వనపు చిలిపిఆట అదరింది!
మరిప్పుడు కొంగుచాటు దొంగాటలా ఉందే నన్ను అదలగొట్టకే వదలవే గడసరి వయ్యారి కాంతం! ఓ నా సూర్యకాంతం.!!
నా ఆనలో నీవు అనుకున్నా అప్పుడు, నీ ఆనలో నేను ఇప్పుడు ఎంత పనిచేసావే? నా హృదయ ప్రియ మణి!
నా మతిని ,నా గతిని,నా స్థితిని అధోగతి చేసావే! నీపై కాస్తంత కోపం ఉన్న నేనెప్పుడూ నీవెంటే అప్పుడు ఇప్పుడు నీవే ఓడిపోయావులే!! ఓ నా శ్రీ మతి!!చందన వదనాల కమలాక్షీ!!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.