ఎగబడి ఎగబడి ఎకరాలకు ఎకరాలు కొనుగోలు,
జొరబడి జొరబడి జోరు జోరున సిగలో నగలు
పోటీ పడి పోటీపడి ప్లాట్లకు ప్లాట్లు క్రయవిక్రయాలు
త్వరబడి త్వరబడి చేర్చిన తరగని సిరిసంపదలు
తడబడి తడబడి పొరపాట్లు, ఆగని అగచాట్లు
తిరగబడి తిరగబడి కాయం ఆయుష్షు ముడితే
దాచడానికి, పూడ్చేందుకు, కాల్చడానికి నీవి ఏవి రావు జీవా!
ఆ ఆరు అడుగుల తావు ఎవరిదో, ఎరిగి మసలుకో ఓ జీవా!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
----------------------------------------------------------
బతుకు గీత మీద నిలబడ్డ మనిషి మెతుకు కోసం వెతుకు;
వెతల జోలికి పోలేడు, వెనుతిరిగి రానులేడు తనకు తెలుసు;
తనది అతుకుల ఆరాటం అని ఆకలి పోరాటం అని;
ఆచి తూచి అడుగులు వేయక తప్పదు లేకుంటే
తను , తనవెంట ఉన్న వారు బురద మడుగులో దూరు
దూరం ఎంతైనా, భారం ఎలాంటిదైనా నూటికి నూరు సూటిగా పోలేడు, పోయినా దిక్కు మాలిన చిక్కు దారే ఏ మాత్రం వెనక్కి మరలిన జాడ కాడ(కడ) మాయం అగు
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------------------
పెరట్లో పూలు పెరటికే సొగసైన అందం
తోటలో పూలు విరబూసిన తోటకే అరవిందం
సిగలోని పూలు నాజూకైన చిన్న దాని సిగకే సింగారం
కంఠహారం లోని పూలు పండంటి జంటకే మణి హారం
పరుపు పై పూలు పరువపు పరుగుకే మెరుపుల శోభయానం
గుడిలో దేవుడి మెడ,పాదాల చెంత పూలు పూజకే భక్తిరసమయం
బడిలో గురువు ఎద పై చేరే మాల గురుభక్తి కే సన్మానం
దేశభక్తుడు పాదాల క్రింద నలిగిన పూలు ,మోక్షానికే సేవ తాత్పర్య అంకితం
ఆ పూల కంటే ఈ పూలు నలిగి పవిత్ర తో పరవశించి పోవు
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
------------------------------------------------------------------
గెలవక ముందు సీటు కోసం ప్లేట్ ఫిరాయింపు;
గెలిచక పదవి ;రాబడి కోసం అగచాట్ల కంపు!
కర్మ ఖాళీ ఓడితే తనవాళ్ళే మోసం చేసారని తలంపు,
అట్లా జంపు అయ్యారు అని ఇంపుగా! బుకాయింపు!!
రాజకీయం లో ఇలాంటి మాటలే బదలాయింపు!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
------------------------------------------------------
చీకటి వెలుగును కప్పింది!
ఆ వెలుగు రేపటి చీకటిని వీడాలని ఎదురు చూస్తుంది!!
అవినీతి నీతిని పాతర వేసింది!
ఆ నీతి అవినీతిని ఏవగించుకుని ఏనాటికైనా తరుముతుంది!!
అసత్యం సత్యాన్ని దాచివేస్తుంది!
ఆ సత్యం అసత్యాన్ని దహించి పైకిలేస్తుంది!!
అధర్మం ధర్మాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తుంది!
ఆ ధర్మం కొరడా ఝరిపి అధర్మాన్ని తాటతీస్తుంది!!
కలత మమతను వేరుచేసింది!
ఆ మమత కలతను చెదరగొట్టితీరుతుంది!!
అసహనం సహనాన్ని రెచ్చగొట్టింది!
ఆ సహనం ఎప్పుడైనా విజయకేతనం ఎగురవేస్తుంది!!
మతి గతి తప్పి స్థిమితం కోల్పోయింది!
గమనంలో మతి గతిని స్ధిర స్ధితిని చేయున్ తధ్యం !!
ఇవే చురకశ్రీ వారి మాటస్వర్ణ కాంతి బాట !!!
-------------------------------------