నీ నరాల సత్తువ నారుమడులకు పోసి;
నీ తనువు నిసత్తువై భగభగ మండే ఎండల్లో కండరాలు కరిగి ;
ఆరుగాలం పంటలకు నీవు గాలం అయి ;
నీ ఉడుకు రక్తాన్ని ధారగా చేసి సేద్యకాలువలకు స్వేదపు నీటి చుక్కలుగా మార్చిన సేదగాడా! నీ డొక్కన ఆకలిని చంపుకొని, తనువు సొట్టలు చేసుకుని పట్టెడన్నం పట్టణవాసులకు కడుపార నింపే ఓ రైతన్నా!! నీవు భూమాత ఇష్ట,కష్ట పుత్రుడవు!
సృష్టి ఉన్నంతవరకు నీకు ఎదురు లేదు, నీ బతుకు కు ఒదుగులేదు!! ఇదిగో రైతుభరోసా ఉన్న నీకు కులాసా లేదు; ఇది ఇదీగో రైతురుణమాఫి అన్నా; నీ జీవనంసాఫీ కాకపోయే! పండిన పంటను చూసి మురిసిపోతివి గిట్టుబాటు ధరలేక తట్టుకోలేక క్రుంగి పోతివి కర్షక కపోతమా!!
నీ కాయకష్టం మాయతీరంగా మారి నీ జీవితం మరక అయి నరకయాతన అయ్యే ధరణీదేవి సుపుత్రుడా!
నీకు ఎంతయిచ్చిన కొరతే,దానికి కొలత లేదు ఓ! "మట్టిమనిషి"జనానికి బువ్వపెట్టే ఓ! ఋషి!ఓ! మహర్షీ!!
ఒంటిమీద బట్ట ఉందోలేదో చూడవు,పైరుమీదే నీ ధ్యాస, అదే నీ శ్వాస;
ఆ ఆశతో మా నోటికాడికి పంచభక్షాలు అందించే "కుటింబి" నీవు త్యాగశీలుడవే!
ఓ కృషీవలుడా! మా ఉక్కుశరీరాలకు నీవే దిక్కుమొక్కు;
లేకుంటే మేము తుక్కు ఓ భూమండల తోటమాలి హాలికుడా! నీవే మా సజీవ యజమానివి!!
నీ కడుపు నకనక లాడుతున్న పంట కంకుల పరువాలు చూసి నీ మోమున పకపకలు వికసించు ఓ రైతుబిడ్డా! ఓ కాపుబిడ్డా!!
ఏరువాక సందడి నీ ఇంట పండగ,నీ ఒంటి నిండా పూనకాల దండయాత్ర!
అదొక చిత్రమైన వేడుకల జాతర, సమాజానికి ఏదొకటి అందించాలన్న నీ కోరికల పాత్ర
సాధనలో ఎరువుల కొరతలున్నా,కరువుకాటకాలున్నా,ఎన్నో ఎన్నో వేదనలున్నా ;
పరువుగా సాగే నీ జీవన స్రవంతి ఆదర్శమయం !
నీ అనంత ఆనందాల జీవనసాగర సంగమం !!
నీవు నిరంతర శిక్షణా పరుడవు ! ఆకర్షణ పరుడవు నిన్ను అవమానించేవారు, గమనించక హేళనచేసేవారు భిక్షకులు! ఓ కర్షక మహా మహర్షీ!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.