ఏమని వర్ణించను నిన్ను తేటగీతిలోన లేక
నీ అందచందాలు తనివితీరా చూస్తూ నీ పెదాల మకరందాన్ని ఆస్వాదిస్తూ కందం లోన
నీతో జతై ఆడిపాడిన ఆటపాటల ఆనందపు గడియల జ్ఞాపకాల దొంతరల అంతరంగాల అనంత భావనలను ఆటవెలదిలోన
నీ హృదయ స్పందనలు నా మదిలో బంధి అయి బంధనాలను పెనవేసుకున్న శార్దూలంలోనా
నీ ఊహాలలో విహారం చేసి నిన్ను నాలో అంతర్లీనంగా చేసుకున్న ఉత్పలమాలలోనా అలంకరణ చేయాలా
నీ చారేడు యేసి కళ్ళ సొగసులు నాలో గుసగుసలాడి నీఒడిలో బడలిక పొందిన చంపకమాలతోనా
నవరసాల మధురిమలతో చిందులు వేసి ఉత్సవాలు చేసే మత్తేభం లోనా
సరస ఉల్లాసాలతో స్వీయ ఆభరణాలతో నడయాడే నయాగరా నడకలాగా సాగే సీసము లోనా
నీ బిగు బాహువులు బంధనాలు నా తనువు బంధి అయిన ద్విపదలోనా
నీ సుతిమెత్తని పలుకులతో నన్ను మత్తు ఎక్కించే మత్తకోకిల లోనా
నా సమస్త అక్కరలు తీర్చి సర్వం నన్నే తలచి నీ మతిలో యతి ప్రాసలు లేకున్న, ఉన్న అక్కరలులా హత్తుకునేలా ఉండిపోయే నా ప్రియసతి గా ఆరాధన చేయనా!! నా ప్రియసఖీ!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ)కావలి.