మట్టితత్వం(వచన కవిత)
-డా.పెంకి విజయ కుమార్
పిల్లలకు కాస్త జాగా చాలు
ఏ ఆటైనా ఆడేస్తారు
ఆటలు ఆడాలంటే
పెద్దగా ఖాలీ స్థలం అవసరంలేదు
ఆటకు మనసు సిద్ధంగా ఉంటేచాలు
అదే పెద్ద మైదానం వారికి
మట్టిలో పొరులుతూ ఆడుతూంటే
మట్టి రేణువులు వాళ్ళతో కలిసి పోతాయి
మట్టిదీ వారిదీ అన్యోన్య సహవాసం
మట్టి వారికి ప్రాణ స్నేహితుడు
ఆటల్లో చిన్నచిన్న గాయాలైనా
అవి ఆటలో అరటి పండ్లే
గాయాలను మట్టితో ముద్దాడించి
దెబ్బ పెద్ద జబ్బేం కాదని జబ్బలెగరేయించేది ఆటల్లోని ఆ గమ్మత్తే
మట్టికి పిల్లలంటే ఎంతో మమకారం
పిల్లలు తనతో ఆడనిరోజు
మట్టి ఘొల్లున ఏడుస్తాది...
పిల్లలు మెట్టని మట్టీ ఓ మట్టేనా?
మట్టిలో ఆడని పిల్లలూ ఓ పిల్లలేనా?
మట్టితో అనుబంధంలేక
అయినోళ్ళ పెద్దలు,పిల్లలు పిప్పళ్ళ బస్తాలను తలపిస్తున్నారు
ఆసుపత్రుల చూట్టూ తిరుగుతూ డాక్టర్లతో చుట్టరికం కట్టబెట్టుకుంటున్నారు
కొవ్వు సంగతి పక్కన పెడితే
కరన్సీ మాత్రం మా బాగా కరిగిపోద్ది
మట్టి మహత్యం వాళ్ళకి ఎరుకలేదనుకుంటా?
మట్టి ఆకలినితీర్చే అమ్మేకాదూ...
రుగ్మతలను దరిచేరనివ్వని అంగరక్షకుడు
మట్టితత్వం...నిజంగా సజీవత్వం
✍️ డాక్టర్ పెంకి విజయ కుమార్